తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వం రాకుండా చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరి చూస్తుంటే రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ టిఆర్ఎస్ ఇప్పటికే మొదలు పెట్టేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రతి ఏడాది సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కూడా భీమవరం రానున్నారు. అయితే ఇప్పుడు తన రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలతో తలసాని శ్రీనివాస్ సంప్రదింపులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పర్యటన సందర్భంగా కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి, యాదవ సామాజిక వర్గానికి చెందిన జనాలతో భారీ ర్యాలీ నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాంటి ఒక భారీ ర్యాలీ చేసి, తమ యాదవ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళితే, దాని ప్రభావం ఎన్నికల వరకు ఉంటుందని చంద్రబాబుని ఆ రకంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తలసాని ఒక ప్రైవేటు సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఏది ఏమైనా తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి కట్టడమే కాకుండా మీడియా మద్దతును పెద్ద ఎత్తున సంపాదించి తద్వారా టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టిన చంద్రబాబు మీద బదలా తీర్చుకోవాలని టిఆర్ఎస్ నేతలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.