నాడు ఆలె నరేంద్ర… ఐదారేళ్ల కిందట తాటికొండ రాజయ్యకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఈటల రాజేందర్‌కు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకరిపై దొంగ పాస్‌పోర్టుల ముద్ర.. మరొకరిపై అవినీతి ఆరోపణల ముద్ర వేసి.. వేటు వేశారు. ఆలె నరేంద్ర బయటకు వెళ్లిపోయారు. అయితే రాజయ్య మాత్రం ఉండే పదవి ఉంటుందని పార్టీలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ వంతు వచ్చింది. ఆయనపై టీఆర్ఎస్ అనుకూల మీడియా అయిన రెండు ప్రధాన చానళ్లు.. కబ్జా కథలను హోరెత్తిస్తున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్ కబ్జా చేశారని.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి కథనాలు.. అదీ కూడా.. టీఆర్ఎస్ అనుకూల మీడియాలో మారధాన్ కవరేజీగా రావడం యాధృచ్చికం కాదని.. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా తెలిసిపోతుంది.
నిజానికి ఈటలపై గతంలోనే టీఆర్ఎస్ అధికారిక మీడియాలోనే వ్యతిరేక కథనాలొచ్చాయి. అప్పట్లో ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తర్వాత కరోనా సంక్షోభం రావడంతో సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈటలను టార్గెట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మిని మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే.. మిషన్ ఈటల ప్రారంభమవడం… అందులో అసలు విశేషం. తెలంగాణలో ఇప్పుడల్లా ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ క్రమంలో ఈటలను ఇక నిర్వీర్యం చేయాలని.. పెద్దలు ప్లాన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కొంత కాలంగా ఈటల అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పార్టీ పెడతారన్న ప్రచారం కూడా ఉపందుకుంది.
ఇప్పుడు మీడియాను రాజకీయ పార్టీలు… తమ వ్యూహాల కోసం వాడుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లి … పని పూర్తి చేసుకుంటున్నాయి. నిజంగా మంత్రి ఈటల కబ్జా చేసినట్లయింతే.. ఆధారాలతో కేసులు పెట్టి.. న్యాయపరంగా పోవాలి. కానీ.. టీఆర్ఎస్ అనుకూల చానళ్లు తీర్పులిచ్చేస్తున్నట్లుగా… ఈటల తప్పు చేశాడని నిర్ధారిస్తూ.. మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని డిసైడ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం.. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కాని సద్దుమణిగే పరిస్థితి లేదు. వీటిపై ఈటల ఇంత వరకూ స్పందించలేదు. తనపై పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆయన చాలా కాలంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈటల స్పందన పై అంతటా ఆసక్తి నెలకొంది.