ఇప్పుడంతా సర్వేల సీజన్ నడుస్తున్నది.. అంతేగాక వివిధ రాజకీయ సంస్థలూ శక్తులూ అభిప్రాయసేకరణల పర్వంలో మునిగిపోతున్నారు. టిడిపి టిఆర్ఎస్లు తమ శైలిలో ఎప్పుడూ ఏదో ఒక సర్వే ప్రత్యక్షంగా పరోక్షంగా తెప్పిస్తూనే వుంటాయి. ఇది గాక ఏ ఛానల్ లేదా ఏ ఏజన్సీ సర్వే చేసినట్టు తెలిసినా వారి నుంచి ఆ నివేదిక లేదా అందులోని ముఖ్యాంశాలు తెప్పించేందుకు అనధికారికంగానే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక ఇటీవల వైఎస్ఆర్సిపి ప్రశాంత్ కిశోర్‌ను సలహాదారుగా తీసుకున్న తర్వాత ఆ బృందం కూడా పాత్రికేయులను మేధావులను వ్యాపారవేత్తలను కలసి అభిప్రాయాలు సేకరిస్తున్నది. పార్టీ పనిలో లేదా జగన్ శైలిలో ఏం మార్పులు కోరుకుంటున్నారని వారు ప్రశ్నలు వేస్తన్నారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలంగాణలో వ్యక్తిగతంగా తమ తమ సర్వే నివేదికలు తెప్పిస్తున్నారు. అయితే ఎవరూ అనుకోని విషయం ఏమంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని తెరవెనక నుంచినడిపించే ఆరెస్సెస్‌కు అనుబంధంగా లేక అనుకూలంగా వుండే సంస్థలు కొన్ని ఇదే పనిలో వున్నాయి. ఎపి తెలంగాణలలో రాజకీయ పరిస్థితినీ మోడీ ప్రభుత్వ పనితీరును గురించి వారు వివరంగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు.మరీ ముఖ్యంగా బిజెపి అవకాశాలు పొత్తులు ఎత్తుల గురించి వారి ఆసక్తి వుంటున్నది.