తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు కాక మీద ఉన్నాయి. పార్టీని చాలా కాలం పాటు కంటికి రెప్పలా కాపాడిన హరీష్‌రావును కానివాడిని చేశారు. పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యం లేదు. కనీసం ఫోటో పెట్టడానికి కూడా అనుమతి రావడం లేదు. చివరికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం… అతి తీవ్రంగా శ్రమించిన .. హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. దాంతో.. హరీష్‌పై.. టీఆర్ఎస్లో అంతర్గతంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. అదే సమయంలో.. సామాన్య ప్రజల్లోనూ హరీష్‌కు అన్యాయం జరుగుతోందనే భావన పెరిగిపోతోంది.
కాళేశ్వరం క్రెడిట్ హరీష్‌కే కట్టబెట్టిన సోషల్ మీడియా..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీష్ రావు రాలేదు. సొంత బిడ్డ పెళ్లికి.. తండ్రి వెళ్లలేదన్నంతగా.. సోషల్ మీడియా హోరెత్తిపోయింది. హరీష్ కష్టానికి ఇంకెవరో క్రెడిట్ పొందుతున్నారన్నట్లుగా ప్రజలు సానుభూతి వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి.. హరీష్‌పై ఈ సానుభూతి .. ముందస్తు ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. ఎందుకంటే.. అప్పట్నుంచే ఆయనను… కేసీఆర్ దూరం పెట్టడం ప్రారంభించారు. కుమారుడ్ని అందలం ఎక్కించడానికో… మరో కారణమో… హరీష్‌ను.. సిద్దిపేట ఎమ్మెల్యేగా మాత్రమే… పరిమితం చేశారు. ఆయనకు కనీస గౌరవం దక్కడం లేదు. ప్రగతిభవన్‌లో కి ఎంట్రీ లేదు. ఫామ్‌హౌస్‌కి పిలుపురాదు. ఓ రకంగా ఇప్పుడు.. టీఆర్ఎస్లో హరీష్‌రావు.. ఎవరికీ కాని నేత.
ఎంత అవమానిస్తే అంత విధేయత చూపుతున్న హరీష్..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి పిలువలేదని.. హరీష్ ఏ మాత్రం బాధపడలేదు. అలా అని.. తన కష్టం… ప్రాజెక్ట్ నీటిలో కలిసిపోయేలా చేసుకోవడానికి ఆయన ఏ మాత్రం సిద్ధంగా లేరు. తన క్రెడిట్ తనకు రావడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. సిద్దిపేటలో.. ఘనంగా.. కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. తన గురించి చెప్పుకోలేదు కానీ… కేసీఆర్‌ను విపరీతంగా పొగిడారు. ఇదంతా వ్యూహాత్మకమే. హరీష్ రావు రాజకీయ ఓనమాలు నేర్చుకుంది.. కేసీఆర్ దగ్గరే. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఆయన ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేసిన నేత. కేసీఆర్ ఎలా రాజకీయాలు చేస్తారో కింది స్థాయి నుంచి తెలిసిన నేత. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఊహించగలిగిన నేత. అంతే కాదు.. కేసీఆర్ రాజకీయానికి మరింత మెరుగులు పెట్టి… అద్భుతమైన ఫలితాలు సాధించడం.. హరీష్‌కు వెన్నతో పెట్టిన విద్య. అంటే గురువును మించిన శిష్యుడన్నమాట. ఆ విషయం.. తన రాజకీయ అడుగులతోనే ఎప్పుడో బయట ప్రపంచానికి తెలియచేశారు.
హరీష్‌కు అంతకంతకూ పెరుగుతున్న సానుభూతి..! టీఆర్ఎస్కు తప్పని టెన్షన్..!
టీఆర్ఎస్ అగ్రనాయకత్వం తనను ఎంతగా మర్చిపోతే… హరీష్ అంత కంటే ఎక్కువగా విధేయత చూపుతున్నారు. కేసీఆర్ అవమానిస్తున్నా… చిరునవ్వుతో ఉంటున్నారు. కేసీఆర్ ఎంత అవమానించినా బద్దుడిగా ఉంటున్నానని .. రాజకీయ జీవితం ఇచ్చిన గురువు పట్ల.. గౌరవం ప్రదర్శిస్తున్నానన్న సందేశాన్ని పంపుతున్నారు. పదవుల కోసం తాను.. ఏదో చేయాల్సిన అవసరం తనకు లేదని చెబుతున్నారు. ఇదే.. ప్రజల్లో ఆయనపై అభిమానం పెంపొందేలా చేస్తోంది. ఆయనపై సానుభూతి వచ్చేలా చేస్తోంది. హరీష్‌రావుకు కూడా ఇప్పుడు కావాల్సింది అదే. కేసీఆర్ తనను ఎంత దూరం పెడితే అంత మంచిదని.. నమ్ముతున్నారు. అదే సమయంలో.. తనను ఎంతలా హ్యూమలేట్ చేస్తున్నారో .. ప్రతీ వివరం బయటకు తెలిసేలా చేసుకుంటున్నారు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. పాపం … హరీష్ అనుకునేలా.. పరిస్థితులు తెప్పించుకోవాలనుకుంటున్నారు. అప్పుడే అసలు గేమ్ ప్రారంభమవుతుంది. ఇది టీఆర్ఎస్కు మంచిది కాదనే అభిప్రాయం.. .ఆ పార్టీ అంతర్గత చర్చల్లో నడుస్తోంది.