పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారైంది. అక్టోబర్ 21న ఎన్నిక జరుగుతుంది. మూడ్రోజుల్లోనే అంటే, 24న ఫలితాలను వెల్లడిస్తామని సీఈవో రజత్ కుమార్ షెడ్యూల్ ని ప్రకటించారు. ఈ నెల 23 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తెరాస నుంచి సైదిరెడ్డిని అభ్యర్థిగా మరోసారి ఎంపిక చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద స్వల్ప ఓట్ల తేడాలో ఆయన ఓడిపోయారు. ఈసారి కూడా సైదిరెడ్డికే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ ఉప ఎన్నికల బాధ్యతల్ని మంత్రి హరీష్ రావుకి అప్పగిస్తారని మొదట్నుంచీ అందరూ అనుకున్నా… మరో మంత్రి జగదీష్ కి ఈ వ్యవహారాలను సీఎం అప్పగించినట్టు సమాచారం. అవసరమైతే మరికొందరు మంత్రులు, చుట్టుపక్కల నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఆయనకి సహాయం చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన అధికారికంగా ఇంకా వెలువడలేదు. పద్మావతి అభ్యర్థిత్వంపై ఎంపీ రేవంత్ రెడ్డి విభేదించారు. ఆ పంచాయితీ మరో పక్క అలానే ఉంది. అయితే, ఉత్తమ్ కి మద్దతుగా జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు జిల్లాలో ఏకమయ్యారు. రేవంత్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకమాండ్ కి కూడా చెప్పినట్టు సమాచారం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కాదని పద్మావతిని కొనసాగిస్తారో, ఈ విషయంలో రేవంత్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారో ఇంకా తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ లో నెలకొన్న ఈ కలహాలే ఇప్పుడు తెరాసకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఈ లొల్లి మీదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సైదిరెడ్డితో చర్చించినట్టు సమాచారం. వెంటనే, ప్రచారం ప్రారంభించాలనీ, కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించినట్టు చెబుతున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి, వారి ప్రచారం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాగే అవకాశం ఉండదనీ, ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలని ఇతర నేతలకు కూడా సూచించారట! మొత్తానికి, కాంగ్రెస్ ఇంటి పోరును హైలెట్ చేసే ప్రయత్నంలో తెరాస ఉందనేది అర్థమౌతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందా, లేదంటే అంతర్గత కుమ్ములాటలతోనే కాలయాపన చేస్తుందా అనేది చూడాలి.