ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి తుమ్మలకూ కాంగ్రెస్ సిపిఎంలతో త్రిముఖ సమరమే జరగనుంది. కాంగ్రెస్ నాయకులు పూర్వపు ఎంఎల్ఎ మాజీ మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను అభ్యర్థిగా నిర్ణయించి అందరి సహాయం అర్థించారు. అందుకోసం అధికారికంగా వైసీపీ అద్యక్షుడు జగన్ను భట్టి విక్రమార్క కలవడంలో చాలా సంకేతాలున్నాయి. ఇక విచిత్రంగా వారికి తెలుగుదేశం కూడా మద్దతు ప్రకటించింది! సానుభూతిని,కాంగ్రెస్ అభ్యర్థనను కారణంగా చూపించింది. ఏది ఏమైనా తెలుగుదేశం పోటీకి శ్రమపడబోదని ముందే తేలిపోయింది. శనివారంరాత్రి ఒక వివాహ విందులో తెలుగుదేశం ముఖ్యులను కలసినప్పుడు అది స్పష్టమైంది. అయినా అంతర్గత చర్చల ప్రక్రియ జరిపామనిపించి నిర్ణయం ప్రకటించారు. ఫలితం లేని పోరాటం చేయకుండా పరువు కాపాడుకున్నారు. బరువు తగ్గించుకున్నారు! ఈలోగా పువ్వాడ అజరు కుమార్ ఫిరాయింపు కాంగ్రెస్కు ఒకింత నష్టమైనా పాలేరులో ఆయన ప్రభావం పెద్దగా వుండదు.
సిపిఎంకు ఇక్కడ గణనీయమైన ఓటింగు వుంది. గతసారి వంటరిగా చేసినప్పుడే దరిదాపుగా మిగిలిన పార్టీలకు దగ్గరగా ఓట్టు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్తో వున్న సిపిఐ ఇప్పుడు సిపిఎంను బలపర్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో వామపక్షాలు ఉమ్మడిగా వ్యవహరిస్తున్న రాజకీయ వాతావరణంలో బహుశా ఎంఎల్ గ్రూపులు కూడా మద్దతు తెల్పొచ్చు. తాము పార్టీలో చర్చించి చెబుతామని భట్టితో అన్నట్టు వచ్చిన వార్తలను సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించడమే గాక పోటీ చేస్తామనీ ప్రకటించారు. కనుక తుమ్మల వర్గం తీవ్రంగానే పోరాడవలసి వస్తుంది. ఖమ్మం, వరంగల్, సిద్ధిపేట మునిసిపల్ ఫలితాలకూ వరంగల్ జిహెచ్ఎంసి ఫలితాలకు తేడా గమనిస్తే ఇతర రాజకీయ శక్తులు కూడా మాయమై పోలేదని బోధపడుతుంది. కనుక పాలేరులో త్రిముఖ పోటీ గట్టిగానే జరుగుతుంది. ఇది ఒక విధంగా ఇతర రాజకీయ సమరాలకూ సూచిక అవుతుంది.