తెలంగామ కాంగ్రెస్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ గాంధీ పర్యటన వివాదాస్పదం చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉస్మానియా విద్యార్థులతో ఒక రోజు సమావేశం కావాలని నిర్ణయించారు. ఉస్మానియా క్యాంపస్‌లోనే ఈ సమావేశం పెట్టాలని పీసీసీ పెద్దలు భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం.. ఈ సమవేశాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలతో ఉస్మానియాలో సమావేశం కూడా నిర్వహించారు. రాహుల్ గాంధీకి ఏపీపై ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదంటున్నారు. ఓయూకి వస్తే అడ్డుకుటామని ప్రకటించారు.
నిజానికి రాహుల్ గాంధీ పర్యటనను .. బహుముఖాలుగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో మొట్టమొదటిది.. తెలంగాణ ఇచ్చిన పార్టీని ఆదరించాలనే సందేశాన్ని ప్రజల్లోకి పంపాలనుకుంటోంది. ముఖ్యంగా యువతలో ఈ భావోద్వేగాన్ని నింపాలనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చినా.. బతుకులు మారలేదని.. అది కూడా కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని చెప్పించాలనుకుంటున్నారు. దీనికి విరుగుడుగా టీఆర్ఎస్ అదే విద్యార్థి, యువత విభాగాలతో.. రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇప్పించేందుకు ప్లాన్ చేశారు. దానికి ఇటీవలి కాలంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీనే అస్త్రంగా చేసుకుంటున్నారు.
గతంలో రాహుల్ గాందీ సంగారెడ్డిలో బహిరంగసభలో ప్రసంగించడానికి వచ్చారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ టీఆర్ఎస్ వర్గాలు కానీ.. కేసీఆర్ కానీ… పెద్దగా స్పందించ లేదు. ఈ సారి ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో రాహుల్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుండటం… టీఆర్ఎస్కు కాస్త ఆందోళన కలిగిస్తున్న అంశమే. రాహుల్ టూర్ ప్రభావాన్ని వీలైనంతంగా తగ్గించేందుకు సెంటిమెంట్‌కు యాంటీ సెంటిమెంట్ జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.