తెలంగాణ రాష్ట్ర సమితి.. ఏపీలో తమ అనుకూల ప్రభుత్వం రావడనికి.. కుల రాజకీయాలను తెరపైకి తెచ్చింది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని నేరుగానే ప్రకటించిన టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కార్యాచరణ కూడా జోరుగానే చేస్తోంది. మొదటగా.. ఏపీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా బహిరంగ సూచన పంపారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా.. ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం దాదాపు ఖాయమయింది. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు… తెలంగాణలో వైసీపీ పోటీ చేయదు కాబట్టి.. ఈ పొత్తుల్లో సీట్ల సర్దుబాటు అనే అంశం ఉండకపోవచ్చు.
ఏపీ మొత్తం కుల పిచ్చితో ఉందని టీఆర్ఎస్ ఎందుకనుకుంటోంది..?
ఏపీలో కుల పిచ్చి ఎక్కువ అని కేటీఆర్ చాలా సార్లు మీటింగుల్లో చెప్పారు. అది ఏపీ ప్రజలపై ఆయనకు ఉన్న అభిప్రాయం అనుకున్నారు. ఏపీని కుల రాజకీయాలే శాసిస్తాయని కేటీఆర్ , కేసీఆర్ నమ్ముతున్నారు. హైదరాబాద్ లోని సీమాంధ్రుల ఓట్లను.. కూడా ఇలా కులాల ప్రకారం విభజించి మంచి ఫలితాలు సాధించామని వారిద్దరూ నమ్ముతున్నారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ కోణంలోనే.. కులాల కుంపటిని ఏపీలో రాజేసి.. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వర్గాలను దూరం చేయడానికి తెలంగాణ నుంచి నేతల్ని ఏపీకి పంపుతున్నారు. అందులో భాగంగా.. మొదటగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. సంక్రాంతి పండగ పేరుతో ఏపీకి వచ్చారు. ఆయనకు వైసీపీ నేతలు అతిథి మర్యాదలు చేశారు. తాము ఏర్పాటు చేసిన బరుల దగ్గర ఆయనతో పందేలు కాశారు. సామాజికవర్గ నాయకులతో.. సమావేశాలు కూడా పెట్టించారు. అక్కడేం జరిగిందో… మ్యాటర్ బయటకు రాలేదు కానీ.. మీడియా ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్.. తాను ఏపీలో బీసీలకు నేతనన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు
తెలంగాణ వాళ్లయినా కులపోళ్లు వచ్చి చెబితే ఓట్లేస్తారా..?
తెలంగాణకు వెళ్లినా.. తలసాని మాత్రం… ఏపీ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఏపీలో బీసీలందరికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. అప్పటికి.. ఏపీలో బీసీలకు ఎవరూ నాయకత్వం వహించడం లేదని.. తెలంగాణ నుంచి తలసాని వస్తే తప్ప.. వారికి లీడర్ దొరకరు అన్నంత క్లారిటీగా ప్రకటన చేశారు. తలసాని ఏపీపైనే గురి పెట్టడానికి కారణం… తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ను చిన్నాభిన్నం చేయడమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. టీడీపీకి మొదటి నుంచి బీసీలు అండగా ఉన్నారు. వారిని దూరం చేయగలగితే.. టీడీపీని ఓటమికి దగ్గర చేసినట్లవుతుందని .. టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ అంచనా అంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపునే గెలిచిన తలసానికి.. టీడీపీ నేతలతో బంధుత్వం ఉంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు తలసాని వియ్యంకుడు. పుట్టా సుధాకర్ యాదవ్ కు.. యనమల వియ్యంకుడు. ఈ బంధుత్వాలకు తోడు.. తలసానికి టీడీపీ నేతలతో స్నేహం ఉంది. దాన్ని ఆయన ఉపయోగించుకుని రాజకీయం చేస్తున్నారు. చివరికి .. తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయని.. . వారందరూ తను చెబితే.. వైసీపీ ఓట్లేస్తారని.. అక్కడ టీడీపీని ఓడించడానికి అది చాలంటూ.. చెప్పుకొస్తున్నారు.
కులాల కుంపటి రగిలించడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందా..?
సామాజికవర్గానికి చెందిన వారైతే మాత్రం.. తెలంగాణ నేతలు వచ్చి చెబితే.. వారు చెప్పిన పార్టీలు.. ఆయా సామాజికవర్గ ప్రజలు ఎలా ఓట్లేస్తారా..? కులానికి ఏపీ ప్రజలు బానిసలన్నట్లుగా ప్రవర్తిస్తూ.. ప్రకటనలు చేయడం ఏపీ ప్రజల్ని ఇది కించపరచడం కాదా..? కులం పేరుతో… రాజకీయాలు చేసి.. ఏపీపై ఓ రకమైన ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఈ రోజు.. తెలంగాణ నుంచి నేతలు వచ్చి ప్రచారం చేసి వెళ్తారని.. రేపు సమస్యలు వస్తే.. వారొచ్చి పరిష్కరించరు కదా..! సామాజికవర్గాల పేరుతో.. ఏపీలో.. రాజకీయం చేయడానికి వచ్చే వారి ఉద్దేశం తెలుగుదేశంపార్టీ ఓటమి కోసమే. బీసీల్లో అపోహలు తేవాలనే కుట్రలు మూడు పార్టీలు చేస్తున్నాయంటున్న టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ.. ..నేరుగా.. టీడీపీకి ఆయువు పట్టు అయిన బీసీల ఓటు బ్యాంక్ పై గురి పెట్టిందని.. తెలుగుదేశం పార్టీకి సులువుగానే అర్థమయింది.
బీసీలు టార్గెట్ గా.. టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలు చేస్తున్న రాజకీయ వ్యూహాన్ని తిప్పికొట్టకపోతే.. ఏపీ శాశ్వతంగా.. కులాల కుపంట్లోకి వెళ్లిపోతుంది.
— సుభాష్