ఎవరేమనుకున్నా కాంగ్రెస్ కే మద్దతివ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ .. తాము కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్ అల్వాకే మద్దతిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్కు పదహారు మంది ఎంపీలు ఉన్నారు. వీరందరూ అల్వాకే ఓటు వేయనున్నారు. ఎలా చూసినా మార్గరేట్ అల్వా గట్టి పోటీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు.
ఉపరాష్ట్రపతిని ఉభయసభల సభ్యులు కలిపి ఎన్నుకుంటారు. అంటే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి ఎన్నుకుంటారు. ఉభయసభల్లో కలిపితే.. బీజేపీకి .. మిత్రపక్షాలకు మూడింట రెండు వంతుల మెజార్టీ ఉంటుంది. అందుకే మమతా బెనర్జీ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్ని పార్టీలు బీజేపీ అభ్యర్థి ధన్కడ్కు మద్దతు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు పలికింది. మిగిలిన అన్ని పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తున్నాయి.
బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ సమయంలో ఎన్నికలకు గైర్హాజర్ అయినా అది బీజేపీకి సపోర్ట్ చేసినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలు తెలంగాణలో రాజకీయాలను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది.