తెలంగాణలో తెరాస ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకునే దిశగా.. కేసీఆర్ సర్కారు మరో కీలకమైన ముందడుగు వేసింది. తెలంగాణలో పేద వర్గాల్లో స్థిరమైన తెరాస ముద్ర ఉండేలా ప్లాన్ చేసిన సంక్షేమ పథకాలను, బీసీల్లో పేదలందరికీ కూడా వర్తింప జేసేలా కేసీఆర్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి పథకం ఇక మీదట బీసీలకు, ఈబీసీలకు కూడా వర్తిస్తుంది. ప్రత్యేకించి ఈ వర్గాల్లో రెండు లక్షల కంటె తక్కువ ఆదాయం ఉన్న వారికి కల్యాణలక్ష్మి వర్తిస్తుందని సర్కారు ప్రకటించింది. ఈ పథకం కింద వివాహసమయంంలో వధువుకు రూ.51 వేల ఆర్థిక సహాయం అందిస్తారు.
మామూలుగా ఎస్సీలకు వర్తించేలా గతంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మైనారిటీలకు కూడా మరో పేరుతో పథకం మొదలైంది. అయితే దీనికి ప్రజలనుంచి స్పందన మంచిగా ఉండడం.. ఒకసారి ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన వారు కలకాలం తమను గుర్తుంచుకునే తరహా అనుబంధం ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ కల్యాణలక్ష్మిని పేదల మీదికి ఒక బ్రహ్మాస్త్రంగా రూపుదిద్ది ప్రయోగించింది. బీసీలకు, ఈబీసీలకు అందరికీ వర్తించేలా పథకం ఏర్పాటు చేయడం అంటే తెలంగాణలో ఉన్న వారిలో మెజారిటీ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. వారంతా కూడా సర్కారు పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారన్నది నిజం.
బీసీలకోసం ప్రత్యేకంగా కేసీఆర్ సర్కారు ఇటీవలి కాలంలో చాలా ప్రేమ చూపిస్తున్నది. ఇటీవలే మార్కెట్ కమిటీ పోస్టుల నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ.. కేసీఆర్ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రహితంగా బీసీ వర్గాల మనసు దోచుకున్నారు. అలాగే.. ఇప్పుడు కల్యాణలక్ష్మి వంటి సూపర్‌హిట్ పథకాన్ని బీసీలకు, ఈబీసీలకు వర్తింపజేయడంపై కూడా జనంలో మంచి స్పందన వచ్చే అవకాశమే ఉన్నది.