” టిక్కెట్ ఎందుకివ్వలేదో.. కేటీఆర్‌ను ప్రశ్నిస్తే.. కేసీఆర్ ఫోన్ చేస్తారని చెప్పారు. ఇరవై రోజులైనా పట్టించుకోలేదు..” ఇదీ బీజేపీలో చేరిన బాబూమోహన్ చెప్పిన మాట. టిక్కెట్లివ్వని ఇద్దరు సిట్టింగుల్లో ఒకరైన బాబూమోహన్ పరిస్థితే ఇలా ఉంటే.. టీఆర్ఎస్లో టిక్కెట్ ఆశించి భంగపడిన మిగతా నేతల పరిస్థితి ఎలా ఉంటుంది…?. అలాగే ఉంది. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం మాట్లాడటం లేదు. అందుకే వారూ.. తమ స్థాయికి తగ్గట్లుగా అసమ్మతిని రాజేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల్ని ప్రకటించిన నియోజకవర్గాల్లో కూడా.. ఇద్దరిద్దరు ప్రచారం చేస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ఇప్పటికే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినా టికెట్ దక్కని ఆశావాహులు పట్టు వదలకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండటం క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది.
టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన దాదాపు 20 రోజులు దాటినా ఇంకా పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు చల్లారటం లేదు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు . ఆ స్థానం ఆశించిన ఎమ్మెల్సీ రాములు నాయక్ టీఆర్ఎస్ కండువాలు వేసుకొని బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. లంబాడా ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతోనే తను రెబల్‌గా అయినా పోటీలో ఉంటానని ఆయనచెబుతున్నారు. రాములుతో మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. రామగుండం నియోజకవర్గం నుంచి సోమారపు సత్యనారాయణను ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే చంద్ర అనే నేత తనే అభ్యర్థి అన్నంతగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసూధనాచారి పరిస్థితి సేమ్ టూ సేమ్. టిక్కెట్ హామీపై టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోచేరిన గండ్ర సత్యనారాయణ నియోజకవర్గంలో ప్రచారాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు కు పోటీగా గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరుపున పోటీ చేసిన ఓటమి పాలైన అమరేందర్ రెడ్డి సీరియస్ గా ప్రచారం ప్రారంభించారు.
వేములవాడ నియోజకవర్గంలో అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. టికెట్ ఆశించిన భంగపడ్డ జెడ్పీ చైర్మన్ తుల ఉమ నియోజవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ కు ఇచ్చారు కెసీఆర్. అదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన కొలన్ హన్మంత్ రెడ్డి కూడ తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇబ్రహీం పట్నం నియోజవర్గంలోనూ ఇదే పరిస్థితి. నిజానికి ఇలాంటి అసంతృప్తుల్ని బుజ్జగించడంలో హరీష్ రావు ముందు ఉంటారు. కానీ ఇప్పుడాయనకు అవకాశం లేదు. కేటీఆర్ చెప్పేది అసంతృప్తి నేతలు వినిపించుకోవడం లేదు. కేసీఆర్ కు అంత తీలిక లేదు. అందుకే.. టీఆర్ఎస్ తరపున నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు ప్రచారం చేసేసుకుంటున్నారు. కొసమెరుపేమిటంటే.. అసలు సిట్టింగుల కన్నా… అసంతృప్త నేతలవైపే టీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. వారంతా ముందు నుంచి టీఆర్ఎస్లో ఉన్నవాళ్లు. టిక్కెట్లు పొందిన వాళ్లు.. ఇతర పార్టీల నుంచి వాళ్లు..!