ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అనే లగేజీని వదిలించుకోవాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఉపఎన్నికల్లో తేల్చుకోవాలన్న లక్ష్యంతో.. స్పీకర్‌ను కలిసి ఆయన రాజీనామా పత్రం అందివ్వాలనుకున్నారు. కానీ స్పీకర్ మాత్రం సమయం ఇవ్వడం లేదు. దీంతో అది వాయిదా పడుతూ వస్తోంది. మామూలుగా ఈటల రాజేందర్‌ను మాజీ చేయాలనుకుంటే… టీఆర్ఎస్కు క్షణంలో పని . స్పీకర్ ఆయన వద్ద నుంచి రాజీనామా పత్రం తీసుకుని వెంటనే ఆమోదిస్తారు.. క్షణాల్లో గెజిట్ ప్రకటిస్తారు. కానీ ఈటల విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందన్న అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. అందుకే ఈటల రెండో వైపు నుంచి నరుక్కురావడం ప్రారంభించారు.
ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ప్రారంభించారు. పెన్షన్లు.. రేషన్ కార్డుల దగ్గర్నుంచి అన్నింటినీ ప్రశ్నిస్తున్నారు. ఈటల ప్రకటనలన్నీ.. ఓ రకంగా పార్టీ ధిక్కారమే. ఆయనపై వేటు వేయడానికి ఇటీవల పెట్టిన రెండు ప్రెస్మీట్లు సరిపోతాయి. ఈటల రాజీనామా నిర్ణయం తీసుకోక ముందు వరకూ.. ఈటలపై అనర్హతా వేటు వేయబోతున్నామని హడావుడి చేశారు. మీడియాకు అదే పనిగా లీకులు ఇచ్చారు. బహుశా… నేడో రేపో ఆయనపై వేటు వేస్తారని అనుకుంటున్న సమయంలో.. ఈటలే రాజీనామా చేస్తానని ప్రకటించారు. స్పీకర్ సమయం కోసం చూస్తున్నారు. కానీ ఎందుకో కానీ.. ప్రభుత్వమే చల్లబడిపోయింది.
ఉపఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై టీఆర్ఎస్ ఇంకా ఓ అవగాహనకు రాలేదని.. అందుకే… ఎంత ఆలస్యం అయితే అంత మంచిదన్నట్లుగా చూస్తున్నారని అంటున్నారు. హుజూరాబాద్‌లో పాతుకుపోయిన ఈటలను ఓడించడం అంత తేలిక కాదు. ఆయన బలం మాత్రమే కాదు.. ఆయనకు సానుభూతి తోడైతే.. ఆ వెల్లువ చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు.. ఒక్కో సారి ఇరవై అవుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.