పీవీ నరసింహరావు సమైక్యవాది. ఏ దశలోనూ ఆయన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను సమర్థించలేదు. అందుకే మొదట్లో పీవీపై కేసీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పీవీ అంటే తెలంగాణ ఠీవీ. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓన్ చేసుకుని… రాజకీయంగా లాభపడే పరిస్థితిలో లేదు కాబట్టి… టీఆర్ఎస్ పీవీని తమ పార్టీ వ్యక్తిగానే చూపించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే ఘనమైన ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్..పీవీ కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టి విజయం సాధించింది. అంతే కాదు.. మరికొంత మంది పీవీ కుటుంబసభ్యులకు పదవులు ఇవ్వడం… అలాగే ఎమ్మెల్సీగా గెలిచిన వాణీదేవికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం వంటి వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు.
సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చినప్పుడే విమర్శలు వచ్చాయి. ఆమెను రాజ్యసభకు పంపి ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపించింది. అయితే… ఎమ్మెల్సీగా గెలిచిన వాణిదేవికి మరింత ప్రాధాన్యం ఉన్న పదవిని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. శాసనమండలి చైర్మన్‌గా ప్రోటోకాల్ ఉన్న పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం జూన్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత సురభి వాణిదేవికి పీఠం ఖరారు చేసే అవకాశం ఉంది.
మరోవైపు పివి కుమారుడు పీ వీ ప్రభాకర్ రావు కూడా ఓ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అలాగే తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహారావు నిలువెత్తు చిత్రపటం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి పీవీ బ్రాండ్.. అసాధ్యమనుకున్నఓ ఎమ్మెల్సీ ఎన్నికను గెలిపించి పెట్టింది. దీంతో… దాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకుని రాజకీయ లాభం పొందేందుకు కేసీఆర్… ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు. తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నారు.