తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందస్తు భేరీ మోగించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరుకు రెడీ అంటున్నా…. ఆ పార్టీ నేతలెవరూ…ఐక్యమత్యంగా లేరు. ఎవరికి వారు ఉన్నారు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తోంది. కోదండరాంకి ఇమేజ్ ఉన్నా.. గ్రౌండ్ లెవల్లో బలం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి వర్సెస్ టీఆర్ఎస్ పోరాటం ఎలా ఉండబోతోంది..?
కేసీఆర్‌కు అధికారం అడ్వాంటేజ్..!
కేసీఆర్ అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగలిగారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయగలిగారు. ఏ విధంగా చూసినా చతురంగ బలాలు కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. రాజకీయాల్లో అంతిమంగా ప్రజలే గెలుపును నిర్ణయిస్తారు. అందుకే చాలా సార్లు… చాలా బలహీనంగా ఉన్నారనుకున్న అభ్యర్థులు కూడా గెలుస్తారు. రాజకీయ మూడ్ గెలిస్తే ఫలితాలు మారిపోతాయి. గెలుపోటములు కేవలం చతురంగబలాల మీదే ఆధారపడి ఉండదు. అవి విజయానికి ఉయోగపడతాయి కానీ.. గెలుపుని సాధించపెట్టలేవు. ఎలా చూసినా కేసీఆర్ చాలా మంది బలంగా ఉన్నారు. కానీ నియోజకవర్గాల్లో.. టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువ ఉంది. టిక్కెట్ కోసం పోటీ పడేవారు…ముగ్గురు, నలుగురు కంటే ఎక్కువగానే ఉన్నారు. అలా ఉన్నారంటే.. ఆ పార్టీ బలంగా ఉందనే అర్థం. వారిలో ఎవరూ.. తాము ఎస్పీ తరపునో.. బీఎస్పీ తరపునో పోటీ చేస్తామని చెప్పరు. అందువల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అభ్యర్థిత్వాల కోసం పోటీ పడుతున్నారంటే.. ఆ రెండు పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
టీఆర్ఎస్కు లాభం చేసేందుకు బీజేపీ పోటీ చేస్తుందా..?
కాంగ్రెస్ పార్టీ సహజస్వభావమే వర్గ పోరాటం. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జాతీయ అధ్యక్ష పదవి మినహా.. ప్రతి ఒక్క పదవికి పోటీ ఉంటుంది. సహజంగా ఎన్నికల సమయంలో.. ఆ పార్టీలో పోటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి.. సహజంగా ప్రజలు పార్టీకి ఓటు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫాం ఇస్తే.. వారికి ఓటు వేస్తారు. అంటే.. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ముఖ్యం. నాలుగైదు సీట్లలో అభ్యర్థులు ప్రధానం అవుతారేమో కానీ.. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వమే ముఖ్యం. ఇప్పటికే తెలంగాణలో.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి.. ఓ కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. మహాకూటమిగా పెట్టాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే విడివిడిగా పోటీ చేస్తే…ఓడిపోతాం… కలసి పోటీ చేస్తే.. ఉపయోగం ఉంటుందన్న ఆలోచనకు ఆయా పార్టీలు వస్తున్నట్లు రాజకీయ పరిమాణాలు నిరూపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ పేరుకు అన్ని సీట్లలో పోటీ చేస్తోంది. గెలిచేందుకు పోటీ చేస్తుందని నేను అనుకోవడం లేదు. కేసీఆర్‌ను గెలిపించడానకికి పోటీచేస్తుందని భావింవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే… టీఆర్ఎస్కు లాభం కలుగుతుంది. కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతింటాయి.
ఎప్పటికైనా టీఆర్ఎస్ ఉపయోగపడుతుందని బీజేపీ భావనా..?
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వకపోవచ్చు. ఇక ఉంది బీజేపీ. బీజేపీ.. తెలంగాణలో ఫోర్స్ కాదు. అధికారానికి పోటీ పడటం లేదు. జాతీయ రాజకీయాల్లో మద్దతివ్వడానికి చాన్స్ ఉంది. అందుకే బీజేపీ కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించవచ్చు. అలాగే.. కేసీఆర్ కూడా బీజేపీకి సంబంధించిన ఐదారు సీట్లలో.. బలహీన అభ్యర్థులను నిలబెట్టి.. రహస్య ఓడంబడిక పెట్టుకోవచ్చు. పరస్పరం లోపాయికారీగా సహకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక సీపీఎం.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయకూడదని జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నామని కాబట్టి.. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెబుతోంది. సీట్లు వచ్చినా రాకపోయినా.. అదే విధానం కాబట్టి.. విడిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రాజకీయ పొలరైజేషన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది.
భావోద్వేగాలే నేటి రాజకీయ ట్రెండ్..!
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలను భావోద్వేగానికి గురి చేసి… ఓట్లు పొందుదామన్నది… రాజకీయ పార్టీల ఆలోచనగా ఉంది. ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు. అసోంలో బీజేపీ ఎలా గెలిచిందో.. .. ఆ పార్టీ రామ్‌మాధవ్ టీంలో పని చేసిన ఇద్దరు వ్యక్తులు ఓ పుస్తకం రాశారు. అందులో అస్సాంలో ఎలా గెలిచారో స్పష్టంగా రాశారు. ప్రజాసమస్యలను తీసుకుని రాజకీయం చేస్తే.. అస్సాంలో అధికారంలోకి వచ్చే వాళ్లమే కాదని.. ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 30, 40 సీట్లు మాత్రమే వచ్చేవి. భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టే వాటినే ఎంచుకున్నామని వాళ్లే చెప్పుకున్నారు. అంటే.. ఇప్పుడు.. ఇది ట్రెండ్. సోషల్ మీడియా కీలకంగా మారినప్పుడు.. ఇది ఇంకా ముఖ్యమైంది. దీన్ని కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. అయితే… 2014 ఎన్నికల్లో ఉన్నంత సెంటిమెంట్ ఉంటుందా.. అన్నది సందేహమే. కేసీఆర్‌కు కొత్త సెంటిమెంట్ లేదు. ఢిల్లీకి గులాంగిరీ వద్దన్నారు. అది కాంగ్రెస్ గురించి అన్నారు. కానీ.. అలాంటిదేమీ లేదు.
కేంద్రంతో ఇస్తావా.. చస్తావా అన్న పోరాటం కేసీఆర్ ఎప్పుడు చేశారు..?
జోన్ల కోసం… ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరకు వెళ్లి చేస్తావా..చస్తావా అని పట్టుబట్టి సాధించుకొచ్చిటన్లు కేసీఆర్ చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ పోరాటంలో అలాంటిదేమీ కనిపించలేదు. అలా చేసి ఉంటే.. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దగ్గర్నుంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ వరకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని సాధించి ఉండేవారు. అలాంటి పోరాటం అయితే చేయలేదు. ఏపీలో ప్రత్యేకహోదా కోసం… అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేశాయి. కానీ తెలంగాణలో అలాంటి ప్రయత్నాలు జరగలేదు. పోరాటాలు చేయలేదు. అలాగే పొత్తులు పెట్టుకున్నా… కూటమికి పూర్తి స్థాయిలో లాభం కలుగుతుందని చెప్పలేము. పొత్తులు పెట్టుకున్నప్పుడు బలమున్నా.. లేకపోయినా… తమకు కేటాయించిన చోట్లా పోటీ చేస్తాయి. అలాంటి సమయంలో.. అదే పార్టీ నుంచి లేదా.. మిత్రపక్షం నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ సమస్య టీఆర్ఎస్కు కూడా ఉంటుంది. ఇలాంటి విషయంలో అన్ని పార్టీలకూ.. ఒకే రకమైన అనుభవాలు ఉంటాయి. వాటిని సీట్ బై సీట్ పరిష్కరించుకోవాలి.
కేసీఆర్‌కి మళ్లీ అవకాశం ఇవ్వాలా..? వద్దా..? అన్నదే ఓటింగ్ అజెండా..!!
కేసీఆర్‌కు ఇంకోసారి అవకాశం ఇద్దామా వద్దా అన్న అంశంపైనే ప్రధానంగా ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ పాలన ఇక చాలు అనుకుంటారా..? అనే దాన్ని బట్టి ఉంటుంటంది. అంటే.. ఔర్ ఏక్ బార్ కేసీఆర్ కావాలా..? వద్దా అన్నదే… డిసైడిండ్ ఫ్యాక్టర్. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల అంశం ప్రస్తావనకు రావొచ్చు కానీ అంతిమంగా… కేసీఆర్‌కు మరోసారి చాన్స్ ఇవ్వాలా..? వద్దా అన్నదానిపై … ఓటింగ్ జరుగుతుంది. కేసీఆర్ అంతా తానై.. ఎన్నికలను టీఆర్ఎస్ తరపున నడుపుతున్నారు. యాభై రోజుల్లో వంద సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా… కేసీఆర్ పాలనపైనా ఫోకస్ చేస్తున్నాయి. ఒక్కో సెక్షన్ ప్రజలు.. ఒక్కో సెక్షన్ సమస్యల గురించి రియాక్ట్ కావొచ్చు.. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు.. కేసీఆర్ కు మళ్లీ పీఠం అప్పగించాలా… దించేయాలా అన్నదే ఒకే ఒక్క ఎన్నికల అంశం.