“తెలంగాణ ఇచ్చింది.. అమ్మా కాదు.. బొమ్మా కాదని” .. మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో అనడం.. తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పింది. ఇప్పుడు తెలంగాణ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తెలంగాణ సాధన ఎవరి వల్ల అనేదే చర్చ. కేటీఆర్ మాటలు కాంగ్రెస్ లో సహజంగానే గగ్గోలు రేపాయి. సోనియా ఇవ్వకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నది కాంగ్రెస్ నేతల పాయింట్. యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చింది కనుక గొప్పతనం అంతా కాంగ్రెస్‌కే దక్కాలన్నది ఆ పార్టీ నేతల వాదన. కేసీఆర్ కూడా అనేక సార్లు తెలంగాణ ఇచ్చింది సోనియానేనని ప్రకటించారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఎదురుదాడి ప్రారంభిచారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ… ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ ను మూర్ఖుడిగా అభివర్ణిస్తూ.. ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే… కుటుంబసమేతంగా కేసీఆర్ వెళ్లి ఎందుకు సోనియాతో ఫోటోలు దిగారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మరో సీనియర్ నేత వీహెచ్… కేటీఆర్ మాటలను పోస్టర్లుగా ఊరు ఊరునా వేస్తామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ నేతలు.. ప్రత్యేకరాష్ట్ర సాధన విషయంలో… కాంగ్రెస్ పార్టీకి కానీ.. సోనియాకు కానీ ఇసుమంత క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం పడటం లేదు. దీనికి కారణం… ఎన్నికలు దగ్గర పడటమే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. తాము ఓడిపోవడం ఏమిటన్న విస్మయం.. నాలుగేళ్ల కిందట.. కాంగ్రెస్ నేతల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కలను సాకారం చేసినా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకోవడంలో నేతలు విఫలమయ్యారని.. హైకమాండ్ తేల్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా… ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే… విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సెంటిమెంట్ ను మరింతగా పెంచడానికి… రాహుల్ గాంధీని..మెదక్ నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనలకు కూడా.. టీ కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
దీన్ని తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ ఎదురుదాడినే ఎంచుకుంది. ముందస్తుకు వెళ్లాలనుకుంటున్న టీఆర్ఎస్…ప్రజల స్వరాష్ట్ర కలను.. నెరవేర్చిన నేతగా.. కేసీఆర్ కు మరో అవకాశం ఇవ్వాలన్న రీతిలో ప్రచారం చేయనున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఏ మాత్రం సానుకూలంగా ఉండకూడదన్న ఉద్దేశంతో.. తెలంగాణ రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రేమీ లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసకెళ్లాలని డిసైడయ్యారు. అందుకే.. ప్రాణాలొడ్డి పోరాడిన కేసీఆర్ ధైర్యం.. ప్రజల మొండి ధైర్యంతోనే తెలంగాణ వచ్చిందని.. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల వేడి పెరిగే కొద్దీ… తెలంగాను తెచ్చిందెవరు..? ఇచ్చిందెవరన్న అంశం… రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యే అవకాశం మాత్రం ఉంది.