జులై నెలాఖరులోపు మున్సిపల్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో చెప్పారు. పార్టీ వర్గాలన్నీ సిద్ధంగా ఉండాలనీ, నాయకులూ మంత్రులూ ఎమ్మెల్యేలూ పూర్తి బాధ్యతలు తీసుకోవాలనీ చెప్పేశారు. అయితే, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల వ్యవహారం కోర్టుకెక్కింది. నిన్న కూడా మున్సిపల్ అధికారులు కోర్టుకి దాఖలు చేసిన కౌంటర్ తో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈనెల 28న మరోసారి వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరు వరకూ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చనేది స్పష్టత వచ్చే అవకాశం లేదు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా ముగించేసి, ఎన్నికలు నిర్వహించేద్దామని తెరాస ప్రభుత్వం అనుకుంది. కానీ, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయనీ, వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో, అంతకుముందు 109 రోజులు గడువు ఉంటే తప్ప పనులు పూర్తికావని చెప్పి… వారంలోనే ప్రీపోల్ ప్రక్రియను ఎలా ముగిస్తారంటూ అధికారుల తీరుపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టుకు మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ వివరణతో సంతృప్తి చెందని న్యాయస్థానం, వార్డుల రిజర్వేషన్లకు కొత్త చట్టం, వార్డుల విభజనకు పాత చట్టం… ఇలా ఒకేసారి రెండు చట్టాలను వాడుకోవడం ఎంతవరకూ సరైందో చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. ఆ తరువాత, అధికారులు దాఖలు చేసిన కౌంటర్ పై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేని చోట్ల ఎన్నికలు నిర్వహించేస్తామని అధికారులు చెప్పినా… మరింత సమాచారం కావాలని కోర్టు కోరింది. తాజాగా దాఖలు చేసిన కౌంటర్ పై కూడా కోర్టు పెదవి విరిచి, మరోసారి సమగ్ర సమాచారాన్ని కోరింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేట్టుగానే కనిపిస్తోంది. అయితే, ఇది కూడా ఓరకంగా మంచిదే అనే అభిప్రాయం తెరాస వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో భాజపా జోష్ పెంచింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు నేపథ్యంలో నగర ప్రాంతాల్లో విద్యావంతుల్లో ఆ పార్టీకి మద్దతు పెరిగిందనే అభిప్రాయం ఉంది. దాన్నే ప్రధాన ప్రచారాంశంగా మున్సిపల్ ఎన్నికల్లో వాడుకునేందుకు భాజపా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, మరో రెండు నెలలు తరువాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే… అప్పటికి వీటి ప్రభావం తగ్గుతుందనీ, ఈలోగా పక్కాగా ఎన్నికల ప్రణాళికలు వేసుకోవచ్చనేది తెరాస ఆలోచనగా తెలుస్తోంది.