వైసీపీ నేతల పరిపాలన దారుణంగా ఉందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. కేసీఆర్ దగ్గర్నుంచి పువ్వాడ అజయ్ వరకూ అనేక మంది ఏపీలో పాలనను గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ పాలనా వైఫల్యాలు ఎలా ఉన్నాయో.. వారితో పోలిస్తే తెలంగాణ ప్రజలు ఎంత బాగా జీవిస్తున్నారో చూడండని పోల్చి చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి పోలికలు అవసరం లేకుండానే రాజకీయం చేయవచ్చు. కానీ టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో ఈ పద్దతినే పాలో అవుతున్నారు. పార్టీ ప్లీనరీలో నేరుగా కేసీఆరే విమర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ దాదాపుగా పరువు తీసినంతపని చేశారు. హరీష్ రావు అయితే.. ప్రతీ సందర్భంలోనూ ఏపీతో పోలిక తెచ్చి తెలంగాణలో ఎంత మంచి పాలన ఉందో చెబుతున్నారు.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి గత ఎన్నికలకు ముందు కేసీఆర్ నేరుగానే వైఎస్ఆర్సీపీకి నేరుగానే సపోర్ట్ చేశారు. అందులో రహస్యమేం లేదు. అందుకే గెలిచిన తర్వాత సీఎం జగన్ నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కూడా భేటీలు జరిగాయి. అయితే గత రెండేళ్ల నుంచి బహిరంగంగా కేసీఆర్ – జగన్ మధ్య ఎలాంటి సమావేసాలు జరగలేదు. దీనికి కారణం ఓ సారి ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరగడమే. అప్పట్నుంచి ముఖాముఖి భేటీలు జరగలేదు.. అలాగని రెండు పార్టీల మధ్య స్నేహం చెడిపోలేదు. రాష్ట్ర అంశాలపై తగాదాలు పెట్టుకోవడం లేదు. కావాలంటే కేంద్రం వద్దకు వెళ్తున్నారు. రాజకీయంగా పరస్పర ప్రయోజనకరమైన విషయాలు ఉంటే అమలు చేసుకుంటున్నారు.
అయితే హఠాత్తుగా టీఆర్ఎస్ విమర్శలు ప్రారంభించడం వెనుక కారణం ఉందంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జగన్ తనతోనే వస్తారని ఆయన గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడా నమ్మకం సడలింది. పరోక్షంగా అయినా బీజేపీతోనే వైఎస్ఆర్సీపీ సత్సంబంధాలు కోరుకుంటోంది. బీజేపీకి యాంటీగా వెళ్లే పరిస్థితి లేదు. అందుకే తమ వెంట రాకపోతే తమ మద్దతు ఉండదన్న మైండ్ గేమ్ ప్రారంభించిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గతంలో కేసీఆర్తో కలిసి నడుస్తామని జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు కేసీఆర్ ఏటికి ఎదురీదుతున్నారని తెలిసి వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తమతో పెట్టుకుంటే కష్టాలు ఖాయమని టీఆర్ఎస్ నేతలు.. తమ ప్రకటనల ద్వారా సంకేతాలిస్తున్నారని అనుకోవచ్చు.