రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆకుల సత్యనారాయణ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఎన్నికల బరిలోనే ఉన్నానని, తాను జనసేన పార్టీని వీడుతున్నానని, ఎంపీ బరి నుండి తప్పుకుంటున్నాను అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారం అని ఆయన పేర్కొన్నారు. తను ఈనెల 22వ తారీఖున నామినేషన్ వేస్తున్నానని, కచ్చితంగా రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బరి లో ఉంటున్నానని ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే హఠాత్తుగా ఆకుల సత్యనారాయణ ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటని ఆ రాజకీయ వర్గాల్లో చాలామంది చర్చించుకున్నారు.
టీఆర్ఎస్ తరఫు నుంచి జనసేన ఎంపీ అభ్యర్థులకు బెదిరింపులు వస్తున్నాయా?
ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు జనసేన నాయకులకు టీఆర్ఎస్ పార్టీ తరఫునుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులను మాత్రమే వీరు టార్గెట్ చేస్తున్నారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీ టికెట్ వచ్చినప్పటికీ దానిని కాదనుకుని శ్రీను వెళ్లి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈయన మీద ఉన్న అభియోగాల కారణంగా పవన్ కళ్యాణ్ ఆయనను తప్పించాడని కొందరంటుంటే, కొంతమంది మీడియా విశ్లేషకులు మాత్రం గేదెల శ్రీనుకు హైదరాబాదులో ఉన్న వ్యాపారాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడులు వచ్చాయని అందుకే ఆయన వైఎస్ఆర్సీపీ కి వెళ్లి పోయాడు అని అంటున్నారు. అలాగే గతంలో జనసేన పార్టీలో చేరిన విష్ణు రాజు కి భీమవరం ఎమ్మెల్యే టికెట్టు కానీ నరసాపురం ఎంపీ టికెట్ కానీ ఇస్తారని చాలామంది ఊహించినప్పటికీ, విష్ణు రాజు తర్వాత తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ లు కలిగిన విష్ణు రాజు ని కూడా టిఆర్ఎస్ నేతలు బెదిరించడం వల్లే ఆయన పోటీ నుండి తప్పుకున్నాడని అప్పట్లో కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టము అని టీఆర్ఎస్ చెప్పిన మాట అబద్ధమేనా?
అయితే ఈ పరిణామాలు చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తాము తలదూర్చము అని కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అబద్ధమే అనిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాము అని వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ పెద్దలు, మార్చి 14న పవన్ కళ్యాణ్, “దయచేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లో తలదూర్చి మా జీవితాలతో ఆడుకోకండి, మా బతుకులు మమ్మల్ని బతకనీయండి” అంటూ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన తర్వాత టీఆర్ఎస్ కూడా మేము ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో వేలు పెట్టము అని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అవన్నీ పైపై మాటలు ఏమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం ఎంపీ అభ్యర్థుల ని మాత్రమే టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతుంది అని వినిపిస్తున్న రూమర్స్ ని బట్టి చూస్తే జగన్ పార్టీకి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలిపించుకుని, తమ ఇద్దరి పార్టీలకి వచ్చిన ఎంపీ సీట్లను ఫెడరల్ ఫ్రంట్ గా చూపించుకుంటూ, కేంద్ర రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించడానికి కేసీఆర్ వ్యూహం పన్నారు ఏమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని అయినా గతంలో తమిళనాడు చేసిన తరహాలో ఒత్తిడికి లోను చేసి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటే పరవాలేదు కానీ ప్రస్తుతం కేసీఆర్- జగన్ లు కొనసాగుతున్న తీరు చూస్తుంటే ఆ ఎంపీలను గంపగుత్తగా మోడీ కి అప్పగించే లా ఉన్నారని అనిపిస్తోంది.
జనసైనికులు టీఆర్ఎస్ కి దూరం జరుగుతారా?
చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత తో జనసైనికులు 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యాన్ని సమాధి చేసేలా టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలు, జగన్ ని వారు భుజాలమీద మోస్తున్న తీరు చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలలో జనసైనికులు టీఆర్ఎస్ పార్టీ నుండి దూరం జరుగుతారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని అభిమానించే జనసైనికులు అంతా టీఆర్ఎస్ పార్టీకి దూరం జరిగితే పార్లమెంటు ఎన్నికలలో కచ్చితంగా దాని ప్రభావం ఉంటుందని మాత్రం ఊహించవచ్చు.