అధికార పార్టీకీ రాజకీయ పార్టీకీ మధ్య ఉన్న సన్నని గీత దాదాపుగా చెరిగిపోయింది. అధికారంలో ఉన్నవారు ప్రజల గురించే ఆలోచించాలి. కానీ, సొంత పార్టీ ఉద్ధరణ కోసం ప్రభుత్వాలను నడుపుతూ ఉండటం ప్రజాస్వామ్యంలో ఎంతవరకూ కరెక్ట్ అనేది అసలు ప్రశ్న! తెలంగాణలో అధికార పార్టీ తెరాస తీరు ఇలానే మారుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల ముసుగులో తెరాస అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగానే కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి! వ్యక్తిగతంగా ఉండాల్సిన నమ్మకాలను ప్రభుత్వంపై రుద్దేసి… వాస్తు బాలేదని సెక్రటేరియట్ భవనాన్నే వదిలేశారు! ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, ఎన్ని రకాలు విమర్శలు వస్తున్నా పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి ముఖ్యమంత్రి నివాసాన్ని నిర్మించారు. ఇప్పుడా ప్రగతి భవన్లో త్వరలోనే ఓ కార్యక్రమం మొదలౌతుందట! దాని పేరు.. ప్రజా దర్బార్!
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచీ, గ్రామాల నుంచీ ఎప్పటికప్పుడు ప్రజలను ఆ దర్బారుకు పిలుస్తారట. కనీసం ఓ వెయ్యి మందితో ఒకేసారి ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అయ్యేంత విశాలంగా సదరు దర్బారును నిర్మించారు. ఈ దర్బారుకు వచ్చిన ప్రజలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహిస్తారట. సీఎంగా ప్రమాణం చేసిన తరువాత కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న అపవాదును ఈ దర్బారు ద్వారా తొలగించుకునే వ్యూహంలో ఉన్నట్టు సమాచారం.
విశేషం ఏంటంటే… ఈ దర్బారు కోసం తరలి వచ్చే ప్రజలకు దారి ఖర్చులు, భోజన వసతులూ సర్కారు వారే కల్పించబోతున్నట్టు సమాచారం. ఇలా వచ్చే ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపిస్తారు, బంగారు తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో… భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయబోతున్నారో వివరిస్తారు. అలాగే, ప్రజలు ఏం చేయాలో కూడా సదరు ప్రెజెంటేషన్ల ద్వారా వివరించనున్నట్టు తెలుస్తోంది.
ఏతావాతా ఈ దర్బారు ద్వారా ఒనగూరే ప్రయోజనం ఏంటంటే… తెరాస వీరాభిమానులను తయారు చేసుకోవడం! ప్రజాదర్బారు అంతిమ ప్రయోజం ఇదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన అసలే కేసీఆర్… ఏ రాజకీయ ప్రయోజనం లేకుండా ఏపనైనా ఎందుకు చేస్తారండీ! ఇన్నాళ్లూ ఇతర పార్టీల నాయకుల్ని రాజకీయ శక్తుల ఏకీకరణ పేరుతో తెరాసలోకి గుంజేశారు. ఇప్పుడు, ప్రజల్ని ఇలా దర్బారు హాలుకు పిలిచి, బ్రెయిన్ వాషింగ్ మొదలుపెడతారన్నమాట! తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీ అభివృద్ధి కోసం ప్రజా దర్బారు పనిచేస్తుందన్నమాట! అదీ ప్రజాధనంతో… ప్రభుత్వ విధానంతో!