వనమా రాఘవ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు సంచలనాత్మకం అయింది. ఆయన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో బాధితులూ బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ఆయనను తమ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ విషయంలో పోలీసులు మీనమేషాలు లెక్కించడమే కారణం. మొదట పట్టుకున్నారని.. తర్వాత పట్టుకోలేదని ఇలా రకరకాల కారణాలు పోలీసులు చెప్పడంతో … ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
రెండు రోజుల తర్వాత మళ్లీ శుక్రవారం రాత్రి తాము వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. నిజానికి కొత్తగూడెంలో పోలీసులు.. రెవిన్యూ అధికారులు మొత్తం వనమా రాఘవ గుప్పిట్లో ఉండేవారే. వారి ఆశీస్సులతోనే ఆయనకు అక్కడ పోస్టింగ్‌లు వచ్చాయి. వారి అండదండలతోనే రాఘవ ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఈ అంశంలో పోలీసులు వనమా రాఘవకు వ్యతిరేకంగా వెళ్తారని.. ఎవరూ అనుకోవడం లేదు. అందుకే టీఆర్ఎస్ ఈ విషయంలో మరింత గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది.
వనమా రాఘవ ఆకృత్యాల విషయంలో పోలీసు రికార్డులు స్పష్టంగానే ఉన్నాయి. నాలుగు నెలల కిందట ఓ వ్యాపారి కూడా ఆయన పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా పేర్లు రాయకుండా ఆత్మహత్య చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇన్ని ఘోరాలు చేస్తున్నా.. ఆయన తీరుపై ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉండదా అన్న సందేహం సహజంగానే అందరికీ వస్తుంది. లేకుండా ఏమీఉండదు..ఉండే ఉంటుంది. కానీ రాజకీయాల కారణంగా ఆయనను ఏమీ అనలేని పరిస్థితి టీఆర్ఎస్లో ఉందని భావిస్తున్నారు. నిజానికి వనమా గెలిచింది టీఆర్ఎస్ తరపున కాదు. కాంగ్రెస్ అభ్యర్థిగా. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆ మరకల్ని టీఆర్ఎస్ భరించాల్సి వస్తోంది.
వనమా వెంకటేశ్వరరావు వయసు ఎనభై దాటింది. ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఉండే అవకాశంలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కఠిన చర్యలు తీసుకుంటే ఇమేజ్ అయినా పెరుగుతుందన్న సూచనలు ఆ పార్టీ హైకమాండ్‌కు వస్తున్నాయి. దీనిపై టీఆర్ఎస్ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు.