vఎన్నికల కౌంటింగ్ మొదలైన మొదటి గంటలోనే ట్రెండ్ స్పష్టమైంది. తెలంగాణలో స్పష్టమైన మెజారిటీ దిశగా కారు జోరుగా వెళ్తోంది. కేవలం మొదటి రెండు రౌండ్లలో దాదాపు 80 సీట్లలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కేవలం 20 సీట్లలో మాత్రమే ఆధిక్యాన్ని కనపరిచింది. దీంతో నిన్నటిదాకా హోరాహోరీ పోటీ ఇస్తుంది అనుకున్న ప్రజా కూటమి చతికిలబడి నట్టు అయింది.
సెప్టెంబర్ 6న కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సమయానికి టిఆర్ఎస్ కి స్పష్టమైన మద్దతు ప్రజల్లో కనిపించింది. అయితే చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టాక, కాంగ్రెస్తో జట్టుకట్టాక చంద్రబాబుకు సహజంగానే ఉండే మీడియా బలం ప్రజా కూటమికి షిఫ్ట్ అయింది. దీంతో ప్రజా కూటమి రెండు నెలల అతి స్వల్పకాలంలోనే విపరీతంగా బలపడ్డట్టు, విపరీతంగా ప్రచారం చేసింది మీడియా. పేరుమోసిన రాజకీయ విశ్లేషకులు , కొద్ది నెలల క్రితం వరకు టిఆర్ఎస్ కు ఎదురు లేదు అని వాదించిన రాజకీయ విశ్లేషకులు సైతం ఆ మీడియా ప్రచారానికి అయోమయంలో పడి, బహుశా హంగ్ వచ్చే అవకాశం ఉందేమో అంటూ మాట్లాడటం ప్రారంభించారు. దీనికితోడు లగడపాటి రంగంలోకి దిగి ఎనిమిది నుంచి పది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పేసరికి మరింత గందరగోళం ఏర్పడింది. మొత్తానికి ఈ రెండు నెలల పాటు ప్రజా కూటమి బలాన్ని విపరీతంగా పెంచి చూపించిన మీడియా చివరికి ఫలితాలు వచ్చే సరికి కంగుతిన్నట్టు అయింది.
అయితే నాలుగేళ్ల పాటు సంక్షేమాన్ని చూసిన ప్రజలు, కరెంటు నీళ్లు వంటి మౌలిక వసతుల విషయంలో కెసిఆర్ చూపించిన పురోగతిని అర్థం చేసుకున్న ప్రజలు, మీడియా ఎంత హైప్ చేసినా, దాన్ని పట్టించుకోకుండా కెసిఆర్ కి పట్టం కట్టారు. కెసిఆర్ ఎప్పటినుంచో చెబుతున్నట్లు టిఆర్ఎస్ దగ్గర దగ్గరగా వంద సీట్ల వరకు గెలుపొందే అవకాశాలు ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ బట్టి కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజలు టిఆర్ఎస్ వైపే ననీ, ప్రజా కూటమి, కాంగ్రెస్ టీడీపీ ల కలయిక వల్ల కొత్తగా పెరిగిన బలం, ఇదంతా మీడియా హైపే అని మరొకసారి స్పష్టమైంది.
– జురాన్ (@CriticZuran)