బీజేపీపై టీఆర్ఎస్ ప్రకటించిన వరి యుద్ధం ముగిసినట్లుగానే కనిపిస్తోంది. అంతిమంగా విజయం సాధించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి కారణం ఈ సీజన్లో అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకునేందుకు అంగీకారం తెలుపుతూ లేఖ రాయడమే. ఖరీఫ్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకునేందుకే కేంద్రం ఇదివరకు అంగీకరించింది. కానీ ఇంకా ఎక్కువ ఉందని దాన్ని కూడా తీసుకోవాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.
100 కిలోల ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం వస్తుంది. ఈ లెక్కన కేంద్రం వానాకాలంలో సేకరిస్తామన్న 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం 68.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రానికి ఇవ్వగా ఇంకా 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నులు ఏపీ సర్కార్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని.. దాన్ని ఏం చేయాలా అ్న టెన్షన్ తెలంగాణ సర్కార్‌కు ఉంది.
అయితే రాజకీయంగా టీఆర్ఎస్ చేసిన పోరాటం కొంత మేర సత్ఫలితాలను ఇచ్చింది. కొనుగోలు చేస్తామని కేంద్రం అంగీకారం తెలిపింది. యాసంగి పంట గురించి ఇప్పటి వరకూ క్లారిటీలేదు. ఒప్పందాలు చేసుకునే సమయం ఇంకా రాలేదు కాబట్టి చెప్పలేమని కేంద్రం అంటోంది. ఈ అంశంపై తాము తాత్కాలిక విజయమే సాధించామని.. యాసంగి విషయంలో మరోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.