రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి వున్న రెండవ స్థానానికి కాంగ్రెస్ ఎంపి వి.హనుమంతరావును పంపించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సహకరించే అవకాశాలున్నాయంటూ వస్తున్న కథనాలు వూహాగానాలే. టిఆర్ఎస్పై రోజూ కత్తులు నూరుతున్న కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా చెప్పుకునే వ్యక్తిని కోరి కోరి రాజ్యసభకు పంపించదు. విహెచ్పట్ల సోనియాగాంధీకి అభిమానం వుండొచ్చు గాని కెసిఆర్‌కు వుండాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధనలో ఆయన గొప్పపాత్ర వహించినట్టు టిఆర్ఎస్ చెప్పిందీ లేదు. సోనియా గాందీ స్వయంగా కోరితే కెసిఆర్ పరిశీలించవచ్చునేమో గాని అది జరిగేపని కాదు. గతంలో శాసనసభ ఎన్నికల సమయంలోనే బయిటపడని మేడమ్ విహెచ్ కోసం అంత దిగివస్తారని భావించలేము. తెలుగుదేశంను పూర్తిగా జీర్ణంచేసుకున్నాక టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌నే పోటీదారుగా భావిస్తున్నది గనక ఆ పార్టీకే రాజ్యసభ స్థానం కట్టబెట్టి ఒక విమర్శకుణ్ని తెచ్చిపెట్టుకోదు. ఏతావాతా విహెచ్ ఇంటిదారి పట్టడం అనివార్యం అవుతుంది.