కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి పెడుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న పార్టీనే మళ్లీ ఆయన లాంచ్ చేయలేరు.పైగా తెలంగాణ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి. ఓ ప్రాంతీయ పార్టీ.. మరో జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండలేరు. కేసీఆర్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. ఆ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేయాలి. అప్పుడు టీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది.
తెలంగాణలో టీఆర్ఎస్ లేకపోవడం అంటే అంత కంటే ఆత్మహత్యాసదృశమైన నిర్ణయం మరొకటి ఉండదన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేలా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం పేరు మార్చేస్తే ప్రజల్లో ఆ సెంటిమెంట్ దెబ్బతినవచ్చు. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని.. మనదైన గుర్తింపు పోతుందని టీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. వి
లీనం చేసినా అనేక సమస్యలు వస్తాయి. పార్టీ గుర్తు దగ్గర్నుంచి ప్రతీ అంశాన్ని మళ్లీ కొత్తగా చెక్కుకుంటూ రావాలి. అంతకు మించి తెలంగాణ ప్రజల్లో మన పార్టీ అనే భావనపోతుంది. అదే జరిగితే మూలాలను పెకిలించుకున్నట్లే అవుతుంది. అలాగని విడివిడి పార్టీలుగా కొనసాగించలేరు. టీఆర్ఎస్ను ప్రత్యేక పార్టీగానే ఉంచి.. బీఆర్ఎస్కు అనుబంధంగా చేస్తే చాలన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ అధ్యక్ష పదవుల నుంచి వైదొలిగి.. కేటీఆర్‌కుపూర్తి స్థాయి చార్జ్ అప్పగిస్తే సరిపోతుందని.. బీఆర్ఎస్ .. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తుందని.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ రూపంలో బరిలో ఉండేలా ప్లాన్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ అంశంపై పార్టీ ప్రకటన సమయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.