తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా.. ప్రభుత్వ పరంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కొత్తగా వారికి విశ్వసనీయ అధికారుల సమస్య కూడా ఎర్పడుతోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత అధికారులు ప్రభుత్వంపై నమ్మకం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని.. వారు విపక్షాలకు కావాల్సిన సమాచారం ఇచ్చి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడుతున్నారని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత మంది అధికారులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యాధృచ్చికంగా వారంతా బీహార్‌కు చెందినవారే. ప్రాధాన్యం దక్కని అధికారులు రగిలిపోతూ ఉన్నారు. ఇలాంటి వారి తరపున రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆరోపణలు ప్రారంభించారు. అయితే రేవంత్ ఆషామాషీగా ఈ ఆరోపణలు చేయడం లేదని.. కొంత మంది తెలంగాణ ప్రాంత సివిల్ సర్వీస్ అధికారులు ఆయనకు పూర్తిగా అండగా ఉంటున్నారని.. కావాల్సిన సమాచారం ఇస్తున్నారని తెలుస్తోంది.
ప్రగతి భవన్లో ఉండే అధికారులంతా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులే. అయినప్పటికీ అత్యంత కీలకంగా .., సీక్రెట్‌గా ఉండాల్సి ప్రగతి భవన్ సమాచారం కూడా ఇటీవలి కాలంలో విపక్షాలకు చేరుతోందని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే విపక్షాలకు టార్గెట్ అవుతున్నామని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సమాచారం ఎలా బయటకు వెళ్తుందో విశ్లేషణ చేస్తున్నారు. అనుమానం ఉన్న కొంత మంది అధికారుల్ని ప్రగతి భవన్‌కు దూరం చేశారు. మరికొంత మందినికూడా దూరం చేసే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వం బలంగా ఉండి.. వచ్చే సారి కూడా ప్రభుత్వమే గెలుస్తుందనుకుంటే.. సివిల్ సర్వీస్ అధికారులు గుంభనంగా ఉంటారు. కానీ ప్రభుత్వం మారే అవకాశం ఉందంటే.. తర్వాత వచ్చే ప్రభుత్వంలో మంచి పోస్టింగ్‌ల కోసం విపక్షాలతో సంబంధాలు పెంచుకుంటారు. కావాల్సిన సమాచారం ఇస్తారు. ఏపీలో టీడీపీ హయాంలో కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులు ఇలా చేసి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో కీలకమైన పదవులు పొందారు.