రాష్ట్రంలో భాజపా నేతలు తెరాసను లక్ష్యంగా చేసుకుని మాటల దాడులు చేస్తుంటే… ఇప్పట్లో తిప్పి కొట్టే ఉద్దేశంతో తెరాస ఉన్నట్టుగా లేదనే అనిపిస్తోంది. భాజపా నాయకులు తెరాస ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడులు పెంచుతూ ఉంటే… వాటిపై తెరాస నేతలు ఇంతవరకూ స్పందించలేదు. మరీ ముఖ్యంగా, భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్, ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన విమర్శలపై సైతం స్పందించేందుకు తెరాస నేతలు ముందుకు రావడం లేదు. కేసీఆర్ కి దమ్మూ ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికల్ని ఆదరాబాదరాగా ఎందుకు జరిపించడం, షెడ్యూల్ ప్రకారమే పెట్టొచ్చు కదా, భాజపా అంటే భయం పట్టుకుందా అంటూ అరవింద్ సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు ప్రస్థావిస్తే… ఆయన స్పందించేందుకు సుముఖతం వ్యక్తం చెయ్యలేదు.
అరవింద్ చేసిన విమర్శలపై స్పందిస్తే… తన స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుందన్నారు కేటీఆర్. నలుగురు ఎంపీలు గెలిచినంత మాత్రాన ఏదో అనుకుంటున్నారని విమర్శించారు. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే తప్ప… వాస్తవంలో వారు చేసింది ఏమీ లేదన్నారు కేటీఆర్. ఏ అంశం మీద విమర్శలు చేయాలో ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావడం లేదనీ, అందుకే ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ చట్టం వల్ల తమకు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ఇక, మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… అనుకున్న సమయానికే ఎన్నికలు ఉంటాయనీ, కోర్టు వ్యక్తం చేసిన అనుమానాలపై ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానమే ఉంటుందని చెప్పారు.
సో.. డీఎస్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించకుండా తప్పుకున్నారు కేటీఆర్. వాటిపై స్పందిస్తే తన స్థాయి తగ్గుతుందనేది… తప్పుకునే ధోరణిగానే కనిపిస్తోంది. ఇదే ఆసరాగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు చేసేందుకు భాజపా నాయకులు సిద్ధమౌతారు. ఇంతకీ భాజపా ఎంపీ చేసిన డిమాండ్ ఏంటీ… తెరాసకు తామంటే భయం పట్టుకుందీ, అందుకే మున్సిపల్ ఎన్నికల్ని బుల్డోజ్ చేస్తున్నారనే కదా! దానిపై ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు. అయితే, తెరాస వైఖరి చూస్తుంటే… సమాధానాలు ఇవ్వడం అంటూ మొదలుపెడితే, తెరాస కూడా భాజపాతో పూర్తిస్థాయిలో కయ్యానికి కాలు దువ్వడం ప్రారంభించినట్టే అవుతుంది. అలాంటి సంకేతాలు ఇవ్వొద్దని అనుకుంటున్నారేమో… ప్రస్తుతానికి ‘స్థాయి’ అనే సాకుని చూపి కేటీఆర్ తప్పుకున్నారనే అనిపిస్తోంది.