రెండూ అధికార పార్టీలు, రెండు పార్టీలకు దండిగా ఎంపీలున్నారు. అటు లోక్సభ,ఇటు రాజ్యసభలోనూ బలం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రంతో తేల్చుకోవాల్సిన చాలా సమస్యలు ఉన్నాయి. ఓ రకంగా యుద్ధం ప్రకటించాల్సిన సమస్యలు. అందుకే తెలంగాణ అధికార పార్టీ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. కానీ అధికార పార్టీకి ఎలాంటి ధైర్యం కూడా లేదు. కానీ రెండు పార్టీలు ప్రకటించినా.. ప్రకటించకపోయినా కేంద్రంపై యుద్ధం చేయడం అనేది మాత్రం సాధ్యం కాదు. చేస్తున్నట్లుగా కనిపించాలి.. ప్రజలను నమ్మించాలనేదే రెండు పార్టీల తాపత్రయం.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నాయి. వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవడం దగ్గర్నుంచి చాలా సమస్యలు ప్రతిపక్ష పార్టీల చేతుల్లో అస్త్రాలుగా ఉన్నాయి. తెలుగురాష్ట్రాల అధికార పార్టీలకూ ఉన్నాయి. కానీ ఆ పార్టీలతో కలిసే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఇంటా బయటా పోరాడాలని అటు జగన్.. ఇటు కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు చెప్పి పంపారు. కానీ ఆ పోరాటం బీజేపీని నొప్పించకూడదని.. ప్రజలకు మాత్రం అలా పోరాడినట్లుగా కనిపించాలన్నది వారి సందేశం. నేరుగా చెప్పకపోయినా ఎంపీలకు అందే .. అందిన సందేశం ఇదే.
భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా తమ సానుభూతి పరులైన ఆ పార్టీలకు.. తమకు సహకరిస్తున్నంతగా సహకరిస్తూ ఉంటాయి. బిల్లలకు.. ఇతర వాటికి ఇబ్బంది లేకుండా ఆయా పార్టీలు తమకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆందోళనలు చేసుకోవడానికి సహకరిస్తుంది. ప్రజల దృష్టిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న భావన కల్పించడానికి తాను కూడా సహకరిస్తుంది. ఈ భిన్నమైన రాజకీయంతో ఎంపీలు కూడా వ్యూహాత్మకంకగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కేంద్రం పరిష్కరించాల్సిన తెలుగు రాష్ట్రాల సమస్యలు సమస్యలుగానే ఉంటున్నాయి. రాజకీయం మాత్రం జరిగిపోతోంది. పార్టీలకు కావాల్సింది అదే కదా మరి !