అమెరికాలో కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల నష్టపోయిన వారందరికీ ట్రంప్ సాయం చేయబోతున్నారు. పెద్దవాళ్లకు 1200 డాలర్లు సాయం అందించనున్నారు. పెరుగుతున్న డాలర్ విలువను దృష్టిలో పెట్టుకుంటే.. అటూ ఇటుగా మన రూపాయల్లో లక్ష. నేరుగా నగదు బదిలీ ద్వారా అమెరికన్ పౌరులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం ప్రకటించారు. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఈ ప్యాకేజీలో భాగం ఉంది. చిన్న పిల్లలకు 500 డాలర్లను అందించబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా.. ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు.. వివిధ రకాలుగా ఏర్పడిన నష్టాన్ని తట్టుకోవడానికి.. రెండు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సెసెన్ ఆమోదం తెలిపింది. రెండు ట్రిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 150 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు.
అమెరికాను షట్ డౌన్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా లేరు. కానీ.. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని అమలు చేస్తున్నారు. ఉత్పత్తికి గండి పడింది. ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కరి ఉపాధి, వ్యాపారానికి ఇబ్బంది ఏర్పడటంతో తక్షణం వారందర్నీ ఆదుకోకపోతే.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ట్రంప్ ఆందోలన చెందుతున్నారు. అందుకే.. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆర్థిక ప్యాకేజీకి సెనెట్‌లో ఆమోద ముద్ర వేయించుకోగలిగారు. ప్యాకేజీలో కేటాయించిన నిధుల్లో 367 బిలియన్ డాలర్లు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేటాయించారు. ఉద్యోగులు ఇంటికే పరిమితయ్యారు. వారందరికీ.. ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లించేందుకు ఈ మొత్తం వెచ్చిస్తారు.
ఇక బడా వ్యాపార సంస్థలకూ భారీ సాయం ప్రకటించారు. 500 బిలియన్ డాలర్లు.. గ్యారంటీలకు.. సబ్సిడీలకు కేటాయించారు. అత్యధికంగా హాస్పిటల్స్‌కు నిధులు అందించబోతున్నారు. ఎక్కడివక్కడ ఆగిపోయిన ఎయిర్‌లైన్స్ సంస్థలకూ సాయం చేయబోతున్నారు. అమెరికా చరిత్రలో ఇంత భారీ ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ ప్యాకేజీలో ప్రధానమైన అంశం… పౌరులకు నేరుగా నగదు అందబోతూండటం…!