‘మా కొలువులు మాకే..మా దేశానికి వస్తే షాకే’ అంటూ ట్రంప్ చెలరేగుతున్నా, వలస వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రక్షణాత్మక చర్యలకు దిగినా నాణేనికి రెండో వైపు భిన్న పార్శ్వం ఆవిష్కృతమవుతున్నది.వాస్తవంగా అమెరికా ఉద్యోగాలను భారత్ లేదా మరో దేశమో ఎగరేసుకుపోవడం లేదు.వేతనాల వ్యత్యాసంలో ఉన్న అనుకూలతల వల్లే భారతీయ నిపుణులను అక్కడి కంపెనీలు నియమించుకుంటున్న విషయం విస్మరించ లేనిది. అమెరికాలో భారత ఐటీ కంపెనీలు, ఇతర పాశ్చాత్య కంపెనీలు వ్యయ అనుకూలతల నేపథ్యంలోనే నిపుణుల నియామకాలను చేపడుతున్నాయి.
అమెరికాతో నిమిత్తం లేకుండా ఏ భౌగోళిక మార్కెట్లలోనైనా జరిగేదిదే.. అయితే భారత ఐటీ కంపెనీలు లక్షలాది అమెరికన్ నిపుణులకు అత్యధిక వేతనాలతో కూడిన హైప్రొఫైల్ జాబ్స్‌ను ఆఫర్ చేస్తున్న సంగతిని ట్రంప్ యంత్రాంగం వ్యూహాత్మకంగా విస్మరించిందనుకోవాలి.
భారత ఐటీ కంపెనీలు స్ధానిక అమెరికన్లకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పించినట్టు నాస్కామ్ గణాంకాలు పరిశీలిస్తే వెల్లడవు తున్నది. గత ఏడాది ఇన్ఫోసిస్ 8312 మంది అమెరికన్లను,హెచ్‌సీఎల్ 10,000 మంది స్ధానిక నిపుణులను,విప్రో 15,000 మంది అమెరికన్ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకున్నాయి. ఇక టీసీఎస్, టెక్ మహింద్రా సహా ఇతర భారత ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో అమెరికన్ నిపుణులను నియమించు కున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారత ఐటీ కంపెనీలు దాదాపు 5,00,000 మంది అమెరికన్లకు హైపెయిడ్ జాబ్స్‌ను సమ కూర్చాయి. మరోవైపు గడిచిన ఏడాది అమెరికా ప్రభుత్వానికి అక్కడి భారత ఐటీ కంపెనీలు భారత కరెన్సీలో రూ.12,000 కోట్ల మేర పన్నులు చెల్లించాయి.గత పదేండ్లలో అమెరికా ప్రభుత్వానికి భారత ఐటీ కంపెనీల ద్వారా సమకూరిన పన్ను రాబడి(భారత కరెన్సీలో) దాదాపు రూ.1,20,000 కోట్ల పైమాటే. కండ్లు చెదిరే నాస్కామ్ గణాంకాలు చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడ సంక్షోభంలో కూరుకుపోయిన జాబ్ మార్కెట్‌కు భారత ఐటీ పరిశ్రమ ఆక్సిజన్ అందిస్తున్నట్టే లెక్క. వాస్తవాలను పరిశీలిస్తే ట్రంప్ ముందుకుతెస్తున్న వాదన పసలేనిదని పసిగట్టవచ్చు.
అసలు మేథో వలస భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు నష్టమైతే.. అమెరికాకు అత్యున్నత సాంకేతిక నిపుణుల రాక స్వాగతించదగిన పరిణామం. ఇది అగ్రరాజ్యాధినేతకు తెలియనిది కాకపోయినా వలస వ్యతిరేక నినాదాలు అందిపుచ్చుకోవడం వెనుక పక్కా రాజకీయ కోణమే ప్రధానంగా ముందుకొస్తున్నది.మన ఉద్యోగాలు మనకే అన్న నినాదంతో అమెరికన్లను రెచ్చగొట్టిన ట్రంప్ ఉనికిపాట్ల కోసమే స్థానికులకు ఉపాథి పల్లవితో జాత్యహంకార ధోరణులను ప్రేరేపిస్తున్నారు.
ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా ఉపాధి విస్తరిస్తుందే కానీ, ఉద్యోగాలకు అనుగుణంగా ఉత్పత్తి రంగాల పయనం ఆధారపడిఉండదు.ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించిన ట్రంప్ అక్కడ పడకేసిన పారిశ్రామిక రంగానికీ, ఉపాధి సంక్షోభానికి, పాతాళానికి దిగజారిన జాబ్ మార్కెట్‌కు భారత్ వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులే కారణమనే దుష్ప్ర చారానికి తెరలేపారు.హెచ్1బి వీసాలపై నియంత్రణ, ఇతర ఆంక్షలతో భారత ఐటీ నిపుణులకు చెక్ పెట్టాలనే కుయుక్తులకు పాల్పడ్డారు.
మనమేం చేయాలి..
అమెరికాలో భారతీయులపై దాడులు, జాత్యహంకార ధోరణులను ఎండగట్టడంతో పాటు వాస్తవ పరిస్థితులను ఎత్తిచూపాల్సిన అవసరం నెలకొంది. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడలను చిత్తు చేయడంతో పాటు అమెరికా, పాశ్చాత్య మార్కెట్లపై భారత్ పూర్తిగా ఆధారపడే ధోరణిని పున:సమీక్షించుకోవాల్సిన సందర్భ మిదే. 130 కోట్ల జనాభా కలిగిన భారత్ దేశీయ ఐటీ వినియోగంపై దృష్టిసారించాల్సిన సమయ మిది. మెరికల్లాంటి మన ఐటీ నిపుణులను దేశీయ ప్రాజెక్టుల కోసం ఉపయోగించు కోవడంపై కసరత్తు సాగాలి. రూ కోట్ల విలువైన టెక్నాలజీ ఆర్డర్లను దేశీయ ఐటీ కంపెనీలకు అప్పగించే కార్యాచరణకు కదలాలి. సామాజిక సంక్షేమ పథకాలకు ఐటీ వినియోగాన్ని జోడిస్తూ పటిష్ట అమలుకు ప్రణాళికలు రూపొందిస్తే అటు దేశీయ కంపెనీలు,ఇటు లబ్ధిదారులకూ మేలు చేకూరుతుంది. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలు అవుట్‌సోర్సింగ్‌ను ప్రభావితం చేస్తే ఇతర ఎగుమతి రంగాల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునే వెసులుబాటును మదింపు చేయాలి. నిత్యం స్వదేశీ మంత్రం జపించే మోడీ, అసలు సమస్యను కప్పిపుచ్చి అమెరికాలో ట్రంప్ తరహాలో రాజకీయ కోణం జోడించి తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం యోచిస్తే అతిపెద్ద ఎగుమతి, ఉపాధి రంగమైన ఐటీ పెనుప్రమాదంలో పడటం ఖాయం.
Mahesh Beeravelly