ట్రంప్ ను చంపేందుకు మరో వ్యక్తి ప్రయత్నించారు. తన గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుకుంటున్న ట్రంప్ సమీపంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతను తన ప్యాంట్ జేబులో నుంచి తుపాకీ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. వెంటనే అతనిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ పోస్టు పెట్టారు. తనను ఎవరూ భయపెట్టలేరని ప్రకటించారు.
గతంలో ట్రంప్ పై ఓ యువకుడు నేరుగా కాల్పులు జరిపాడు. ట్రంప్ తృటిలో తప్పించుకున్నాడు. చెవికి స్వల్ప గాయం అయింది. ఆ ఘటన తర్వాత అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి మారారు. బైడెన్ పోటీ నుంచి వైదొలిగి కమలా హ్యరీస్ అభ్యర్థి అయ్యారు. ట్రంప్ వెనుకబడిపోతున్నారని హ్యారీస్ ముందు నిలబడలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మరోసారి కాల్పుల తరహా ఘటన చోటు చేసుకుంది. అసలు ట్రంప్ పైనే ఎందుకు హత్యాయత్నాలు జరుగుతున్నాయి.. ఎగస్పార్టీ అయిన హ్యారీస్ పై ఎందుకు జరగడం లేదని.. ట్రంప్ కు హార్డ్ కోర్ సపోర్టర్ గా మారిన ఎలాన్ మస్క్ ప్రశ్నిస్తున్నారు.
ఇది ఆయనకే కాదు. అందరికీ వస్తున్న డౌట్. అమెరికా రాజకీయాల్లో ఇలాంటి హత్యాయత్నాల ట్విస్టులు దాదాపుగా ఉండవు. కానీ తెలుగు సినిమాల తరహాలో జరుగుతున్న పరిణామాల్ని చూసి… అమెరికా వాసులు ఉలిక్కి పడుతున్నారు. అవన్నీ ట్రంప్ రాజకీయ వ్యూహాలా లేకపోతే ఆయన చేసిన రాజకీయాల వల్ల పెరిగిపోయిన వ్యతిరేకతనా.. లేకపోతే ఇతర పార్టీల వారు కుట్ర చేస్తున్నారా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఈ ఘటనల తర్వాత ట్రంప్ పై పెద్దగా సానుభూతి వ్యక్తం కాకుండా పోతూండటమే అసలు ట్విస్ట్.