అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో నిన్నామొన్నటి వరకూ ఓ రకమైన ఉన్నతమైన అభిప్రాయం ఉండేది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలూ ఉండే దేశమని..ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాల స్వర్గమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది నాలుగేళ్ల కిందటి వరకే. నాలుగేళ్లలో ఆ దేశం పరిస్థితి దిగజారిపోయింది. ఆఫ్రికాలోని కల్లోలిత దేశాలకూ.. అమెరికాకూ పెద్దగా తేడా లేదన్నట్లుగా మారిపోయింది.క్యాపిటల్ భవనంలో రగడ.. కాల్పులు.. నలుగురు చనిపోవడం.. ఓ రకంగా..సివిల్ వార్ లాంటిదే. దాన్ని పెంచి పోషించింది.. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంపే.
ట్రంప్అధికారంలో ఉన్న కాలం.. గెలుపుకు మార్గం వేసుకున్న వైనం.. మొత్తం విభజించు పాలించు అన్న సిద్ధాంతం మీదే. అమెరికన్లలో ఒకరిపై ఒకరికి విబేధాలు సృష్టించి గెలిచారు. తర్వాత అమెరికన్లకు అది నచ్చలేదు. ఓడించారు. దీన్ని అంగీకరించలేకపోతున్న ట్రంప్.. తాను ఏ వ్యవస్థ మీద అయితే ఆధారపడి అధ్యక్షుడ్నిఅయ్యాడో.. అదే వ్యవస్థపై తిరగబడి… ఓడినా గెలవాలనుకున్నాడు. అమెరికాను ఫూల్ చేయాలనుకున్నాడు. కానీ.. అమెరికాను ఫూల్ మాత్రమేకాదు… అంతకు మించి చేశాడు. చివరికి తానేం చేశాడో.. వెనక్కి తిరిగి చూసుకుంటే… అమెరికా అథం పాతాళంలో కనిపిస్తుంది. అంతగా దిగజార్చాడు. పోతూ పోతూ.. అమెరికాను.. తనతో పాటు పాతాళానికి తీసుకెళ్తున్నాడు.
పాలకుడు చెడ్డవాడయితే.. వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేసి.. తానే ఓ నియంతలా మారాలని అనుకుంటే.. దేశం ఏమైపోయినా పట్టించుకోడు. తన బాగు.. తన వారి బాగు మాత్రమే చూసుకుంటారు. ఇది..ట్రంప్ విషయంలో స్పష్టమయింది. ప్రజలు భావోద్వేగాలకు గురై ఓట్లు వేస్తే.. ట్రంప్ లాంటి పాలకుడు వస్తాడు. అన్ని రకాలుగా ప్రజల్లో విభజన తెస్తాడు. చివరికి దేశానికే చెడ్డపేరు తెస్తాడు. ట్రంప్ వ్యవహారం.. ఒక్క అమెరికన్లకే కాదు.. ప్రపంచ దేశాల ప్రజలందరికీ గుణపాఠం. తెలుసుకోనంత కాలం… ఆయా దేశాలు కునారిల్లిపోతూనే ఉంటాయి.