డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉందని వైద్యులు చెబుతున్నా.. ఆయన మాత్రం ఎవరి మాటా వినట్లేదు. బలవంతంగా డిశ్చార్జ్ చేయించేసుకుని వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయంటూ వైట్‌హౌస్ వర్గాలు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే తర్వాత కోలుకుంటున్న ట్రంప్.. ఆదివారమే డిశ్చార్జ్ చేయాలని డాక్టర్లను ఆదేశించారు. డాక్టర్లు నిరాకరించడంతో మరో రోజు ఆస్పత్రిలోనే ఉన్నారు. కరోనా బారిన పడినప్పటికీ ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారాన్ని ఆపడం లేదు. ట్విట్టర్లో నిమిషానికో ట్వీట్ చేస్తూ ఓట్ వేయాలంటున్నారు. డెమోక్రట్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఎన్నికల ప్రచారంలో బలహీన పడకుండా ఉండేందుకు ఆయన కోలుకున్నట్లుగా చెబుతున్నారని.. డిశ్చార్జ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ట్రంప్ తీరుపై అమెరికాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ప్రభావం ఇతర దేశాల కంటే అమెరికాపైనే అధికంగా ఉంది. అయితే ట్రంప్ చేష్టలు మాత్రం వైరస్‌ను తేలిగ్గా తీసుకోవాలన్నట్లుగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ వెంట తిరిగే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విషయంలో మొదటి నుంచి ట్రంప్ వ్యవహారశైలి నిర్లక్ష్యంగానే ఉంది. అమెరికాలో అత్యధిక ప్రాణనష్టం జరిగినా ఆయన తీరులో మార్పు రాలేదు.
తాను జాగ్రత్తలు తీసుకోబట్టే.. మరణాలు రేటు తక్కువగా ఉందన్నారు. ఇప్పుడు తనకు స్వయంగా కరోనా సోకినా అదే పరిస్థితి. ట్రంప్ నిర్లక్ష్యం అమెరికాకు.. ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం తెస్తుందోనని.. ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. అలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితిలో ట్రంప్ లేరు. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు..!