అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధిగా దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ కి ప్రపంచంలో అందరూ లోకువగానే కనిపిస్తున్నట్లు మాట్లాడటం అందరికీ తెలిసిందే. చివరికి ఆయన తన స్వంత పార్టీని కూడా ఖాతరు చేయనట్లుగా మాట్లాడటం విశేషం.
ఆయన ఎ.బి.సి. న్యూస్ ఛానల్ లలో ప్రసారం అయ్యే “దిస్ వీక్” అనే కార్యక్రమం కోసం మాట్లాడుతూ “మా పార్టీలో అందరూ ఐకమత్యంగా ఉంటే మంచిదే. కానీ విడిపోయినా ఐ డోంట్ కేర్! ఈ ఎన్నికలలో నేను తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతున్నాను. ఎందుకంటే మిగిలిన వారితో పోలిస్తే నేను చాలా డిఫరెంట్ క్యాండిడేట్ ని కనుక! నా కోసం మా పార్టీలో వాళ్ళు బలవంతంగా కలిసి ఉండనవసరమేమీ లేదు. పార్టీ కలిసున్నా చీలికలు వచ్చినా ఐ డోంట్ కేర్!,” అని చెప్పారు.
ఆయన మాటలు రిపబ్లికన్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ట్రంప్ అభ్యర్ధిత్వంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిత్వం, అవగాహన లేని అటువంటి వ్యక్తికి తాము ఓటేయదలచుకోలేదని బుష్ వంటి కొందరు సీనియర్లు బహిరంగంగానే చెపుతున్నారు. అత్యున్నతమయిన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి ఆయన అనర్హుడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ట్రంప్ కారణంగానే రిపబ్లికన్ పార్టీ చీలిపోయే ప్రమాదం కనబడుతోందని అన్నారు. ట్రంప్ బహుశః ఒబామా చేసిన వ్యాఖ్యలకి జవాబుగానే ఈవిధంగా మాట్లాడినట్లు అర్ధమవుతోంది. కానీ ట్రంప్ చెప్పిన జవాబుతో రిపబ్లికన్ పార్టీలో నిజంగానే కలకలం మొదలయింది.
తన అభ్యర్ధిత్వం గురించి పార్టీలో భిన్నాభిప్రాయాలున్న మాట వాస్తవమేనని, పార్టీలో అందరినీ ఒప్పించి వారి అండదండలతో డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ పై విజయం సాధిస్తానని చెప్పి ఉంటే సరిపోయేదానికి, పార్టీ ఉన్నా ముక్కలు చెక్కలుగా విడిపోయినా ఐ డోంట్ కేర్! అని ట్రంప్ చెప్పడం తన తల బిరుసుతనం ప్రదర్శించుకొన్నట్లయింది. దాని వలన ఆయన ఇప్పుడు తన స్వంత పార్టీలోనే తన పట్ల వ్యతిరేకత మరింత పెంచుకొన్నట్లయింది. అటువంటి వ్యక్తిని తమ పార్టీ అభ్యర్ధిగా ఖరారు చేసినట్లయితే, చేతికి అందివస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని పార్టీ స్వయంగా జారవిడుచుకొన్నట్లవుతుందని రిపబ్లికన్ పార్టీ నేతలలో కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన సంగతి ఎలా ఉన్నా ఎన్నికల సమయంలోనే పార్టీని ‘ఐ డోంట్ కేర్!’ అంటున్న డోనాల్డ్ ట్రంప్, ఒకవేళ ఎన్నికలలో గెలిచి అమెరికా అధ్యక్షుడయితే అసలు తన పార్టీని ఖాతరు చేస్తారా? ఏమో?