కశ్మీర్‌పై ప్రధాని మోడీకి మాత్రమే కాదు మొత్తం .. భారతీయ జనతా పార్టీకి… చాతి 56 అంగుళాలు వెళ్లిపోయేంత భావోద్వేగం ఉంటుంది. ఆ మాటకొస్తే దేశ ప్రజలందరికీ ఉంటుంది. కానీ బీజేపీ దేశభక్తిలో రాజకీయం ఇమిడి ఉంటుంది కాబట్టి… చాతి ముందుకు వస్తుంది. అలాంటి దేశభక్తి.. ఎప్పుడూ చేసే ప్రకటన ఒకటే.. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. అని. కానీ.. ఆ మాట చెప్పే మోడీ.. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం.. మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను అడిగారట. ఎవరో చెబితే.. దీన్ని ఇండియన్స్ ఎవరూ నమ్మేవాళ్లు కాదు. కానీ నేరుగా.. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంపే చెప్పారు. ఇది రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.
కశ్మీర్‌పై మూడో దేశం జోక్యం కోరిన మోడీ..!?
పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏమీ ఉండబోదంటూ భారత వర్గాలు లైట్ తీసుకున్న సమయంలో… అమెరికా అధ్యక్షుడు బాంబు పేల్చారు. మీడియా ప్రతినిధుల ముందే..కశ్మీర్‌పై మోదీ తనను మధ్యవర్తిత్వం వహించాలని కోరారంటూ చెప్పడం సంచలనంగా మారింది. జపాన్‌లో జరిగిన సమావేశంలో మీరు ముందుకు రావాలని అడిగారని..కోరితే అమెరికా మీడియేషన్ చేసేందుకు సిద్ధమంటూ చెప్పడంపై దేశంలో దుమారం రేగింది. ఓ వైపు ఇమ్రాన్‌ఖాన్ మీడియా ముందే ట్రంప్‌ను కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాలని, మీడియేషన్ చేయాలని కోరడం.. మోదీ కూడా ఇదే అడిగారంటూ చెప్పడంతో… దేశంలో అలజడి రేగింది. కశ్మీర్ సమస్యపై మొదట్నుంచి ఇతర దేశాల జోక్యాన్ని ఏ మాత్రం సహించని భారత్.. ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం కోరమేంటన్నది ఆసక్తికరంగా మారింది.
కశ్మీర్ పై మోడీ చెప్పేది అంతా ఉత్తదేనా..?
రెండు దేశాల మధ్య మూడో వ్యక్తి జోక్యం అనవసరమని తేల్చి చెబుతోంది భారత్. అంతేకాదు. గత ప్రభుత్వాలు, విదేశాంగ పాలసీ కూడా ఏనాడు కశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యాన్ని సమర్థించడం లేదు. ఏనాడు ఏ దేశం సాయం కూడా కోరలేదు. అమెరికా, చైనా లాంటి దేశాలు ముందుకొచ్చినా.. భారత్ దానిని తిరస్కరిస్తోంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఏకంగా మోడీయే తనను కశ్మీర్ అంశంపై మీడియేషన్ చేయాలని కోరారంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అనంతరం ట్రంప్ కామెంట్స్… దేశ రాజకీయాల్లో కలకలంగా మారాయి.
మోడీ నేరుగా సమాధానం చెప్పాలంటున్న ప్రతిపక్షాలు..!
ట్రంప్ కామెంట్స్ చేసిన కాసేపటికే భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్‌కు మోదీ ఏనాడు అలాంటి ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ కశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని పార్లమెంట్లో మంత్రి చెప్పుకొచ్చారు. మోడీ.. ట్రంప్ జోక్యం కోరారంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదంపై రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తీరును తప్పు పట్టారు. ట్రంప్‌కి ఏం చెప్పారో.. జాతికి మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఒక్క మాటతో ట్రంప్.. మోడీ దేశభక్తిని ప్రశ్నార్థకం చేసేశారు.