ప్రపంచాన్ని ఇప్పుడు వైరస్ పట్టి పీడిస్తోంది. అందరికీ ఇదే హాట్ టాపిక్. కానీ ఇప్పుడు దీని తర్వాత అందరిలోనూ ఒకటే ఉత్కంఠ కలిగిస్తున్న అంశం… ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బతికి ఉన్నాడా..? లేడా..? అనేదే. అమెరికా మీడియా బ్రెయిన్ డెడ్ అని ఖరారు చేసింది. కానీ ఆ మీడియాపై ట్రంప్ ఫైరయ్యారు. కిమ్‌కు ఏమీ కాలేదని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ.. ఉత్తరకొరియా నుంచి అలాంటి భరోసా బయటకు రావడం లేదు. దీంతో మౌనం అర్థాంగీకారం అనుకుని… ప్రపంచం మొత్తం… కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితిని అధికారికంగా తెలుసుకునేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ఫిడెల్ క్యాస్ట్రో చనిపోతే.. సంతోష సంతాపం వ్యక్తం చేసిన నేత డొనాల్డ్ ట్రంప్. మనిషి చావులోనూ ఆయన మరో రకమైన రాజకీయమే చూస్తారు. అలాంటిది కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటే… ట్రంప్.. నిస్సంకోచంగా సంతోషం వ్యక్తం చేయాలి. ఎందుకంటే.. అమెరికాకు నార్త్ కొరియా.. కిమ్ అంత బద్దశత్రువులు మరి. కొన్నాళ్ల కిందట ఇద్దరూ వారి వారి వ్యక్తిత్వాల స్టైల్లో తిట్టుకున్నారు. “కిమ్ పిచ్చోడు, పొట్టోడు, లావుగా ఉంటాడు” అని డొనాల్డ్ ట్రంప్… ” ట్రంప్ ఒక వృద్ధుడు, ఆయనకు మతి భ్రమించింది..ఆయన వల్ల ఏం అవుతుంది” అని కిమ్ తిట్టుకున్నారు. అప్పట్లో వీరి గొడవ చూసి.. ఏ అర్థరాత్రో ఆవేశం తెచ్చుకుని ఒకరిపై ఒకరు అణుబాంబలేసుకుంటారేమోనని ప్రపంచం భయపడింది. ఆ తర్వాత సింగపూర్ లో ఇద్దరూ సమావేశమయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి కానీ మిత్ర దేశాలు మాత్రం కాలేదు.
36 ఏళ్ల కిమ్… తన తండ్రి చనిపోయిన తరవాత 2016 మేలో వారసత్వంగా సుప్రీం లీడర్ ఆఫ్ నార్త్ కొరియాగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ దక్షిణ కొరియా ప్రజలకు కిమ్ జోంగ్ గురించి చాలా పరిమితంగానే తెలుసు. ఆ తర్వాత ఆయన గురించి మొత్తం తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. . ఆయన పాలనా శైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. తన మాట వినని వారందర్నీ ఆయన నిర్దాక్షిణ్యంగా చంపేయిస్తారని చెబుతూంటారు. అధికారాన్ని కొల్ల గొట్టే కుట్ర చేశారని… తన భార్య తండ్రిని … అదీ కూడా పాలనలో చేదోడువాదోడుగా ఉంటున్న వ్యక్తిని కూడా.. కిమ్..భూమ్మీద లేకుండా చేశారని చెబుతారు. ఎవరికీ లొంగని మనస్థత్వం కిమ్ జోంగ్ది. ఉత్తరకొరియా అంతా కిమ్ జోంగ్ అంటే భయభక్తులు. ఎవర్నీ లెక్క చేయలరు. విదేశీయుల్ని అడుగు పెట్టనీయరు. టూరిజం కోసం అడుగుపెట్టినా… అక్కడ ఉండే నిబంధనలు పాటించడం సామాన్య విషయం కాదు. పత్రికలన్నీ సెన్స్ అవుతాయి. మీడియా స్వేచ్చ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కిమ్ ఇంతా కర్కోటకంగా ఉంటారా అన్న చర్చలు నడుస్తున్నాయి.
కిమ్ జోంగ్ బ్రెయిన్ డెడ్ అని అధికారిక ప్రకటనే మిగిలి ఉందన్న ఓ అంచనా..గట్టిగానే వినిపిస్తోంది. నిజంగా హఠాత్తుగా బ్రెయిన్ డెడ్ అయితే.. ఎవరూ కాపాడలేరు. అందుకే్ ఉత్తరకొరియా తదుపరి వారసులు ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఉత్తర కొరియాలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు… కాబట్టి… కిమ్ కుటుంబం నుంచే ఒకరు వస్తారు. కిమ్‌కు 36 ఏళ్లు మాత్రమే. ఆయన సంతానం..దేశాన్ని నడిపించే వరకూ రాలేదు. కానీ ఆయనసోదరి మాత్రం.. పదవి కోసం రెడీగా ఉన్నారు. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో ఆమె బలమైన నాయకురాలిగా ఇప్పటికే ముద్ర వేసుకుంది. కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆమె హస్తం ఉన్నట్టుగా ఉత్తర కొరియా మీడియా చెప్పకనే చెప్తున్నది.