భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా… ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ బలపడిందని నమ్మిస్తున్నారు. బెంగాల్ బీజేపీలో ఇప్పుడు తృణమూల్ నేతలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. కేసులు పెట్టి.. భయపెట్టిన నేతలందర్నీ ఎలాగోలా.. బీజేపీలో చేర్పించేసుకుంది. దాంతో ఇప్పుడు వారందరూ… తమ మాతృపార్టీ దీదీ తృణమూల్‌పై యుద్ధం ప్రకటించారు. తమ పార్టీ నుంచి వెళ్లి తమపైనే యుద్ధం ప్రకటిస్తున్న వారిపై దీదీ .. నేరుగా ఎటాక్ చేస్తున్నారు.
బెంగాల్లో మమతా బెనర్జీకి బీజేపీ సవాల్ విసురుతోంది. అయితే బీజేపీ నేతలంతా తృణమూల్ నుంచి వెళ్లినవారే. దీంతో ఆమె వారికి చెక్ పెట్టడానికి ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది. నందిగ్రాం ప్రాంతంలో బలమైన నేతగా ఉండి బీజేపీలో చేరిన సువేందు అధికారి అనే నేతను నేరుగా ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయనపై పోటీకి సిద్ధమయ్యారు. నందిగ్రాం అంటే దేశం మొత్తానికి తెలిసిన విషయం అక్కడ జరిగిన భూపోరాటం. బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు టాటా నానో కార్ల తయారీ ఫ్యాక్టరీని నందిగ్రాంలో పెట్టాలనుకున్నారు. అక్కడ జరిగిన భూసేకరణ తీవ్ర వివాదాస్పదమయింది. రైతులు పోరాడారు. ఆ పోరాటంలో తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ పోరాటం చేసి.. తర్వాత అదే ఇమేజ్‌తో అధికారం దక్కించుకుంది. ఆ సమయంలో నందిగ్రాంలో తృణమూల్ పార్టీని నడిపించిన నేత సువేందు అధికారి. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరిపోయారు. ఈయన పేరు శారదా స్కాంలో ఉంది.
నందిగ్రాం ప్రాంతం మొత్తాన్ని బీజేపీకి కంచుకోటగా మారుస్తానని సువేందు అధికారి సవాల్ చేస్తున్నారు. దీంతో నేరుగా మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. నందిగ్రాంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే సువేందు అధికారికి సవాల్ విసిరారు. తానే నందిగ్రాం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఒక్క సారిగా సంచలనం నమోదయినట్లయింది. వెంటనే సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రకటనపై స్పందించారు. మమతా బెనర్జీపై తాను అర లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అలా గెలవకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. ఓడిపోతే ఆయన రాజకీయ సన్యాసం చేసేదేముంది.. ప్రజలే చేయించినట్లు అవుతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. వివిధ ఓపీనియన్ పోల్స్‌లో … మమతా బెనర్జీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఫలితాలు వెల్లడవుతున్నాయి.