బిహార్ లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులిద్దరూ మంత్రి పదవులు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వారిలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాలూ చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ తొమ్మిదవ తరగతి ఫెయిల్ అవగా, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ 12వ తరగతి వరకు చదువుకొన్నాడు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవితో బాటు రోడ్లు మరియు భవనాల శాఖను కేటాయించారు. ఇక తేజ్ ప్రతాప్ యాదవ్ కి పర్యావరణ శాఖను అదనంగా కేటాయించారు. వారికున్న విద్యార్హలతో తమ మంత్రిత్వ శాఖల గురించి వారు అవగాహన చేసుకొని వాటిని సమర్ధంగా నిర్వహించడం కష్టమే.
ఎటువంటి రాజకీయ, పరిపాలనా అనుభవం, అందుకు తగ్గ వయసు, విద్యార్హతలు లేని తేజస్వీ యాదవ్ రెండు కీలకమయిన పదవులు ఒకేసారి నిర్వహించడం చాలా కష్టం కనుక లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వంలో వేలు పెట్టకతప్పలేదు. ఆయన నేరుగా కొడుకులతో కలిసి పరిపాలన చేయడం సాధ్యం కాదు కనుక తనకు అత్యంత నమ్మకస్తులయిన ఇద్దరు ఐ.ఏ.ఎస్.అధికారులను తన కొడుకులు నిర్వహిస్తున్న శాఖలకు ముఖ్య కార్యదర్శులకు నియమింపజేసుకొన్నారు. ఇదివరకు తను రైల్వే శాఖ మంత్రిగా ఉన్నపుడు తనతో పనిచేసిన సుదీర్ కుమార్ (1982 బ్యాచ్) ని చిన్న కొడుకు చూస్తున్న రోడ్ల నిర్మాణ శాఖకు ముఖ్య కార్యదర్శిగా, అలాగే ఆర్.కె. మహాజన్ అనే ఐ.ఏ.ఎస్. ఆధికారి (1987 బ్యాచ్)ని పెద్ద కొడుకు చూస్తున్న ఆరోగ్య శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమింపజేసుకొన్నారు. నిన్న రాత్రే బిహార్ ప్రభుత్వం అందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే క్వార్టర్లలో ఫ్లాట్స్ కేటాయిస్తుంది. కానీ అంతవరకు ఆగలేని లాలూ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు పాట్నాలో రెండు ప్రభుత్వ భవనాలను ఆక్రమించేసుకొన్నారు. ఆ విషయం తెలిసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయగా, వారిద్దరినీ పిలిచి ‘ప్రభుత్వం ఫ్లాట్స్ కేటాయించేవరకు ఆగలేరా?’ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ క్లాసు పీకారు. ప్రజలు, మీడియా మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయనే విషయం గుర్తుంచుకొని క్రమశిక్షణతో మెలగాలని, లాలూ వారిని హెచ్చరించారు. తన కొడుకుల కోసం ప్రభుత్వంలో వేలు పెట్టడం తప్పు కాదనుకొన్న లాలూ ప్రసాద్ యాదవ్, తన ఎమ్మెల్యేలు ఆటవిక రాజ్యం ఏర్పాటుకి శ్రీకారం చుడుతుంటే ఫైర్ అయిపోయారేమిటో?