పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వద్ద హైవేపై చనిపోయి కనిపించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం అయింది. అది రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా భావించినప్పటికీ క్రైస్తవ సంఘాలన్నీ హత్య అని విచారణ చేయాలని ఆదేశించడంతో పోలీసులు మొత్తం ఏం జరిగిందో బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ బయలుదేరినప్పటి నుంచి సీసీ ఫుటేజీలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ శరీరం ఏ మాత్రం కంట్రోల్ లేని స్థితిలో బైక్ నడుపుతూ జర్నీ చేశారని గుర్తించారు.
విజయవాడకు చేరుకోక ముందే బైక్ నడపలేని స్థితిలో పాస్టర్ ప్రవీణ్
హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ ఎందుకు రాజమండ్రి వచ్చారో కానీ ఆయన హైదరాబాద్ లో పక్కా ఏర్పాట్లతోనే ప్రారంభమయ్యారు. బైక్ రైడింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టమని గుర్తించారు. లాంగ్ రైడ్స్ వెళ్లే ఏర్పాట్లు ఆయన బైక్ పై ఎప్పుడూ ఉంటాయి. మంచి క్వాలిటీ హెల్మెట్ వాడతారు. అయితే ప్రమాదం జరిగిన రోజు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన తర్వాత ఆయన ప్రయాణం సజావుగా సాగలేదు. కోదాడలో మద్యం కొనుగోలు చేసిన సీన్ పుటేజీలు లభ్యమయ్యాయి. తర్వాత ప్రమాదం జరిగింది. విజయవాడకు వచ్చే సరికి ఆయన కంట్రోల్ కోల్పోయారు. ఓ ట్రాఫిక్ ఎస్ఐ ఆయన ఫోటోలు తీశారు. నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకునేలా రోడ్డు పక్కన పార్కులో ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ రాత్రి బయలుదేరారు. రాజమండ్రి వెళ్లే సరికి మరోసారి ప్రమాదం జరిగింది.
రోడ్డుపక్కన నాలుగు గంటల నిద్ర
అయితే ఆయన వాహనాన్ని మరో కారు ఢీకొట్టిందా.. ఢీ కొడితే ఆ కారు ఎవరిది అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఒక వేళ ఆయనే అదుపుతప్పి పడిపోవడానికి ఎంత అవకాశాలు ఉన్నాయన్నదానిపై పరిశీలనలు చేస్తున్నారు .పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో ప్రవీణ్ హిందూ, ముస్లింలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆ కోణంలో ఎవరైనా చేశారా అన్నది కూడా పరిశీలించారు. కానీ అలాంటివాటిపై కనీస ఆధారాలు కూడా లభించలేదు.
హర్షకుమార్, పాల్ వద్ద ఆధారాలు తీసుకోనున్న పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. అది హత్య అని ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగేలా చేయడానికి హర్షకుమార్, పాల్ లాంటి వాళ్లు ప్రయత్నించారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్యే అని ఆందోళనలు చేశారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే పోలీసులు ఈ కోణాన్ని కూడా వదిలి పెట్టలేదు. వారిని ఆధారాలు సమర్పించాలని అడిగారు . వారు సమర్పించే ఆధారాలతో తదుపరి దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.