సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈలోగానే ప్రధాన పార్టీల్లో మొదలైన హడావుడి చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో తెరాస నడిపిస్తున్న తెర వెనక రాజకీయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో భాజపా బలపడే అవకాశం ఉందనీ, తెరాసతో నేరుగా తలపడే సమర్థత తమకే ఉందనీ, సొంతంగానే బరిలోకి దిగుతామనీ ఈ మధ్య కమల నేతలు కాస్త హడావుడి చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కూడా తెలంగాణలో ఒక రౌండ్ టూరు కొట్టి వచ్చారు. కేసీఆర్ పాలనకు ప్రత్యామ్నాయం తమదే అంటూ నిన్నమొన్నటి వరకూ చెప్పుకుని వచ్చారు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి భాజపా స్వరం మారింది. గడచిన కొద్దిరోజులుగా భాజపా నేతల్లో జోష్ కాస్త తగ్గింది. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయంటూ ప్రచారం చేస్తుండేవారు. ఇప్పుడు ఆ టాపిక్ జోలికే వెళ్లడం మానేశారు. అంతేకాదు, పార్టీల్లో వ్యక్తుల చేరికపై ఓ కొత్త వాదనని అధ్యక్షుడు లక్ష్మణ్ వినిపిస్తూ ఉండటం విశేషం!
ప్రజల్లోకి వెళ్లి పార్టీని పటిష్టం చేసుకోవాలన్నదే ప్రధాన అజెండాగా పెట్టుకుని కృషి చేస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. కిందిస్థాయిలో అనేకమంది చేరుతున్నారనీ, అయితే.. వ్యక్తుల చేరిక వల్ల పార్టీకి అనూహ్యమైన బలం వచ్చేస్తుందనో, వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తాయనే తాము భావించడం లేదని ఆయన చెప్పారు! ప్రజలు తమ పక్షాన వచ్చినప్పుడు కచ్చితంగా ప్రత్యామ్నాయంగా మారుతామనీ, అప్పుడు పార్టీ మరింత బలోపేతం అవుతుందని లక్ష్మణ్ చెప్పడం జరిగింది! కేంద్రంలో మోడీ చేస్తున్న అవినీతి రహిత పాలన, పార్టీ విధానాలు, పనితీరు.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశాలు ఇవే అన్నారు. చేరికలు అనేవి నిత్యం కొనసాగుతూనే ఉంటాయని సైద్ధాంతికరించే ప్రయత్నం చేశారు.
ఇంతకీ, నేతల చేరికలపై లక్ష్మణ్ అభిప్రాయం ఇలా ఎందుకు మారిందో తెలుసా..? సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారనీ, భారీ ఎత్తున ఇతర పార్టీల నేతలు భాజపాలోకి రాబోతున్నారంటూ హడావుడి చేసింది వారే. అయితే, ఈ మధ్య రేవంత్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంతో తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ తోపాటు కొంతమంది నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లి చేరారు. ఇదే సమయంలో తెరాసలో కూడా కొంతమంది నేతలు చేరుతున్నారు. అనూహ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. దీంతో భాజపాలోకి చేరేందుకు సిద్ధమైన నేతలు కూడా ఆ రెండు పార్టీవైపూ చూస్తున్నట్టు సమాచారం! లక్ష్మణ్ తయారు చేసుకున్న చేరికల జాబితాలోంచి చాలామంది చేజారిపోయారనీ, పేరున్న నేతలెవ్వరూ ఇప్పుడు భాజపా వైపు చూడటం లేదని సమాచారం. దీంతో తెలంగాణ భాజపా వాదన మారింది. చేరికలు అనేవి ఒక రొటీన్ ప్రాసెస్ అనీ, వ్యక్తుల చేరిక వల్ల వ్యవస్థలో అనూహ్య మార్పులు ఉండవని లక్ష్మణ్ కొత్త వాదన వినిపిస్తున్నారు, అంతే!