తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు, అంతర్గత వర్గ విభేదాలు అనేవి నిత్యకృత్యంగా మారిపోయింది..! ఓ పక్క హైకమాండ్ సీరియస్ గా చెప్పినా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమన్వయంతో ఉండాలని హితవు పలికినా.. అవేవీ నేతలకు పెద్దగా వినిపిస్తున్నట్టు లేదు. తాజా చర్చ ఏంటంటే… గ్రేటర్ కాంగ్రెస్ లో లొల్లి. దానం నాగేందర్ నేతృత్వంలో గ్రేటర్ లో కాంగ్రెస్ నీరసించిన సంగతి తెలిసిందే. సరే, ఆయన ఎలాగూ పార్టీని వదిలేశారు! ఇప్పుడొచ్చిన కొత్త నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ అయినా అందర్నీ కలుపుకుని వెళ్తారా అంటే… అదీ అనుమానంగానే కనిపిస్తోంది.
కొన్నాళ్లుగా గ్రేటర్ లో కమిటీలు లేకుండానే పార్టీ ఉంది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పార్టీ విస్తరణ, గ్రేటర్ లో బలోపేతం చేసే చర్యలపై ద్రుష్టిపెట్టే నాథుడే లేకుండా పోయారు. ఇప్పుడు అంజన్ కుమార్ కు గ్రేటర్ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కమిటీల ఎంపిక మొదలుపెట్టారు. ఇక్కడే లొల్లి మళ్లీ షురూ..! నగర కాంగ్రెస్ కమిటీల్లో పాత నాయకుల్ని పక్కనపెట్టాలనీ, కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే గుర్రు సీనియర్లలో మొదలైంది. నగరంలో ఎమ్.ఐ.ఎమ్.ను ధీటుగా ఎదుర్కోవాలంటే కొత్తవారితో జరిగే పనికాదనీ, అనుభవజ్ఞులు కూడా అవసరమనేది వారి వాదన.
అంబర్ పేట నియోజక వర్గంలో వీ హన్మంతరావుకు తెలియకుండానే కమిటీలు వేస్తున్నారట! దీంతో ఆయన అంజన్ పై గుర్రుగా ఉన్నారు. సీనియర్ నేత శశిధర్ రెడ్డితో కూడా అంజన్ కుమార్ కు విభేదాలున్నాయనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. కాబట్టి, ఆయన కూడా కమిటీల నియామకాలపై పెదవి విరుస్తున్నారట. ఇక, నగరంలో మరో సీనియర్ నేత ముఖేష్ విషయంలోనూ అంజన్ చొరవ అనుమానమే అంటున్నారు. ఉన్న సీనియర్లతో అంజన్ కు సఖ్యత లేదనీ, వారికి కలుపుకుని వెళ్తే తప్ప గ్రేటర్ లో పార్టీ గట్టేక్కే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. పోనీ, నగరంలో పార్టీ శ్రేణులైనా బలోపేతంగా ఉన్నాయా అంటే.. అవీ లేవు! గత కొన్నేళ్లుగా సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీశ్రేణుల్లో కూడా ఉత్సాహం ఆశించిన స్థాయిలో లేదు.
గ్రేటర్ లో సెటిలర్లను తమవైపు తిప్పుకోవడంలో అధికార పార్టీ తెరాస విజయం సాధించింది. గడచిన గ్రేటర్ స్థానిక ఎన్నికలే అందుకు సాక్ష్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహాలో గ్రేటర్ పరిధిలోని సీట్లను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెరాసను సమర్థంగా ఎదుర్కొనాలంటే.. ముందుగా పార్టీలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం అవసరమౌతుంది. కానీ, కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఏకాభిప్రాయం అనేది ఒక బ్రహ్మపదార్థంగా తయారౌతోంది.