మీరు పెట్టరు… పక్కోడు పెడితే ఓర్వలేరు… ఈ మాటలు బీఆర్ఎస్ కు సరిగ్గా సరిపోతాయి. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం ఇప్పుడు నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనానికి కారణం అవుతోంది.
తెలంగాణలో గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో టీచర్ పోస్టులు భర్తీ చేసింది ఒక్కటంటే ఒక్కసారి. 2018లో.. అది కూడా అన్నీ కలిపి 10వేల లోపే. ఆ తర్వాత అదిగో ఇదిగో అని ఆశ పెట్టారే తప్పా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. పైగా విద్యార్థులు తక్కువగా ఉన్నారని స్కూల్స్ ఎత్తేశారు.
2023లో ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల ముందు హాడావిడిగా డీఎస్సీ ప్రకటించారు. అది కూడా 9వేల లోపే… ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిబంధనను కూడా కేసీఆర్ సర్కార్ గాలికి వదిలేసింది. కానీ డీఎస్పీ పరీక్షకు ముందు టెట్ తప్పనిసరి కాబట్టి పెట్టారు. ఈ లోగా ఎన్నికలు… పరీక్షలు వాయిదా.
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే పోస్టులు పెంచారు. స్కూల్స్ తీసివేయమని హామీ ఇచ్చి పరీక్షకు సిద్ధం కాగానే… బీఆర్ఎస్ నాయకులు టెట్ పెట్టాలని డిమాండ్ తెచ్చారు. సర్కార్ కూడా సరే అని చెప్పింది. మేలో టెట్ పెట్టి, డీఎస్సీకి డేట్స్ ఫిక్స్ చేసింది. ఈసారి ఆన్ లైన్ లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఆన్ లైన్ లో పరీక్షకు సెంటర్స్ చాలా తక్కువ. అందుకే జులై 18 నుండి ఆగస్టు 5వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షకు ఏర్పాట్లు చేయగానే… బీఆర్ఎస్ రాజకీయం మరోసారి మొదలుపెట్టింది. వాయిదా… వాయిదా… అని కొంతమంది అని డిమాండ్స్.
నిజానికి, ఈ పరీక్ష వాయిదా వేస్తే… మళ్లీ ఆన్ లైన్ డేట్స్ కు ఇబ్బంది. గ్రూప్స్, దేశంలోని ఇతర పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ పరీక్షలు అన్నీ చూసుకొని డేట్స్ అంటే చాలా సమయం పడుతుంది. అంటే డీఎస్సీ ప్రకటన వచ్చి ఏడాది పూర్తవుతుంది. పరీక్షలు పెట్టకపోతే… రాజకీయం చేసేది మళ్లీ ఇదే బీఆర్ఎస్…. అందుకే సర్కార్ కూడా వాయిదా ప్రసక్తే లేదని, 2లక్షల యువతను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయటం లేదని, పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేస్తుంది. జులై 11 నుండి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించగా… చాలా మంది యువత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.