హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బృందంతో ఛార్టర్డ్ ఫ్లైట్‌లో చైనా వెళ్ళి పదిరోజులు పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు దఫ దఫాలుగా చైనా వెళ్ళబోతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఈ ‘స్టడీ ట్రిప్’లను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు. పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలలో చైనా అనుసరించే విధానాలను ఈ బృందాలు అధ్యయనం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. వచ్చేవారంలో మొదటి విడతలో ఒక బృందం బయలుదేరబోతోంది. ప్రభుత్వంలో, పరిపాలనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతిఒక్కరూ చైనాను సందర్శించి వారు అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, తెలంగాణలో వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను చైనాలోని బీజింగ్ తదితర నగరాల తరహాలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆశిస్తున్నారట.
కేసీఆర్ బృందం తమ చైనా పర్యటనకు రు.2 కోట్లతో లగ్జరీ ఛార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుకుని వెళ్ళటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు మంత్రులు, ఎంపీలు, తదితరులు ఇలా విడతలు, విడతలుగా చైనా బయలుదేరటం మరిన్ని విమర్శలకు తావిచ్చేలా ఉంది. దానికితోడు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిధులకొరతతో అల్లాడుతుండగా, మరోవైపు రైతుల ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగిపోతుండగా ప్రభుత్వంలోని ముఖ్యులందరూ ఇలా పొలోమని చైనాకెళ్ళటం ఎంతవరకు సబబనే వాదనకూడా వినబడుతోంది.