నాయకుల ఫిరాయింపులు, అంతర్గత కలహాలతో కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా మారింది. ఇప్పుడు కొత్త ఉత్తేజం, ఉత్సాహం తొణికిసలాడుతున్నాయి. మల్లన్న సాగర్ వివాదంతో పాటో ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మంచి అవకాశం దొరికింది.
మల్లన్న సాగర్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. లాఠీచార్జి, గాలిలోకి కాల్పులతో వివాదం మరో మలుపు తిరిగింది. లాఠీచార్జిలో గాయపడ్డ రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర చేపట్టింది. మధ్యలోనే ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేస్తారని తెలుసు. ఎందుకంటే ఇంత వివాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రతిపక్ష నేతలను అనుమతించకుండా ఆంక్షలు విధించడం ఆనవాయితీ.
ఏడాదిన్నరకు పైగా ఎదురేలేదన్నట్టు సాగిన కేసీఆర్ పాలనకు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. మల్లన్న సాగర్ వివాదం ఇబ్బందిగా మారింది. ఒకటి తర్వాత ఒకటిగా ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్రజలు భయభ్రాంతులను చేసి భూములను గుంజుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొందరు తెరాస నాయకులే బ్రోకర్లుగా మారి రైతులను బెదిరించి ఒప్పిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు పహరా పెట్టి, ఊళ్లోకి బయటివారు పోకుండా చెక్ పోస్టులు పెట్టి అందరినీ భయపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కొందరు, మంత్రులను తొలగించాలని మరికొందరు నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల్ల మల్లు భట్టి విక్రమార్క తెరాస ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో ఇరుకున పెడుతున్నారు. చివరకు హరిత హారం పథకం కూడా పెద్ద స్కామేనని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం లేని అనూహ్య రాజకీయ వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రతిపక్షాల దూకుడును తట్టుకోవడం తెరాసకు కష్టంగా మారింది.