తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఆర్టీసి పరిస్థితిని సమీక్షిస్తూ చేసిన మొట్ట మొదటి సూచన ఏమిటంటే చీటికి మాటికీ సమ్మెలు చేయవద్దని! ఆర్టీసి ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరిస్తే సరేసరి లేకుంటే ప్రైవేట్ పరం చేసేస్తానని హెచ్చరించారు కూడా. అసాధ్యం అనుకొన్న తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోగలిగినప్పుడు, అందరూ సమిష్టిగా కృషి చేసి నష్టాలలో ఉన్న ఆర్టీసిని లాభాల బాటలోకి మళ్ళించుకోలేమా? అని ప్రశ్నించారు. ఆర్టీసికి ఆదాయమార్గాలు పెంచుకోవడానికి ఆయన చాలా మంచి సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. కెసిఆర్ తన మాటలతో ఆర్టీసి అధికారులకి ప్రేరణ కల్పించగలిగారు. కానీ ఆర్టీసి ఉద్యోగులు ఆయన హెచ్చరికలను, సలహాలను పెడచెవిన పెట్టి గురువారం ఒక్క రోజు సమ్మెకి దిగుతున్నారు.
ఆర్టీసిలో ఉన్న ఏడు కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వేతన సవరణ, డిఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిల చెల్లించాలని కోరుతూ సమ్మె చేస్తున్నాయి. వారి డిమాండ్లు సహేతుకమైనవె అయినప్పటికీ, ఈ సమస్యని మొన్న వారందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసినప్పుడు ఆయన ముందుంచి పరిష్కరించమని కోరి ఉంటే బాగుండేది. ఆర్టీసిని గాడిన పెట్టేందుకు దాని సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వారి సమస్యని కూడా తప్పకుండా పరిష్కరించి ఉండేవారు. ఒకవేళ ఉద్యోగులు తమ సమస్యని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ఉండి ఉంటే, ఆయన మాటకి గౌరవం ఇచ్చి మరికొంత కాలం వేచి చూస్తే బాగుండేది. అప్పటికీ వారి సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు సమ్మె చేసినా ఎవరూ వారిని తప్పు పట్టి ఉండేవారు కాదు! కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించిన మూడు నాలుగు రోజులకే సమ్మెకి దిగడం ఆయనకి సవాలు విసిరినట్లే అయ్యింది. దాని వలన ఎవరికి నష్టం? ఆర్టీసి ఉద్యోగులు ఆలోచించుకొని ఉంటే బాగుండేది.