తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీలు నిరుద్యోగుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అసలు నిందితులెవరో బయటకు తీసుకు రావడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సిట్ దర్యాప్తు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలు నిందితుల్ని కాపాడటానికే సిట్ వేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు కరెక్టేనేమో అన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చే పరిస్థితి ఏర్పడింది.
ఒక్క పేపర్ లీక్ గురించి బయటకు వచ్చింది. తీగ లాగుతూంటే… వందల మంది అలా పేపర్లు కొనుక్కుని పరీక్షలు రాశారని తేలింది. వారిని అరెస్ట్ చేస్తున్నారు కానీ అసలు లీకేజీకి కుట్ర ఎక్కడ జరిగిందో మాత్రం బయట పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి పేపర్లు లీకయ్యాయి. కానీ ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాస్ వర్డ్ దొంగతనం చేసి లీక్ చేశారని చెబుతున్నారు. ఇలాంటి పేపర్లు ఇలా దొంగతనం చేయడం ఎలా సాధ్యం అని సాధారణంగా ఎవరికైనా వస్తుంది.. కానీ సిట్ అధికారులకు రావడంలేదు. వచ్చినా…. మీడియాతో ఏదో లీక్ చేసి.. సైలెంట్ చేస్తున్నారు.
అదే సమయంలో అసలు లీకేజీ బయట కూడా జరిగిందంటూ కేసును అటు మలుపు తిప్పారు. ఓ ఉద్యోగి ఇలా పేపర్ .. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల్లో బయటకు తెచ్చేవాడని.. దాన్నుంచి బ్లూటూత్ పరికరాలు పెట్టి పరీక్షలు రాశారని కొత్త కథలు చెప్పడం ప్రారంభించారు. అసలు సిట్ విచారణ చేయాల్సింది టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ ఎలా లీకయింది.. దీని వెనుక ఎవరు ఉన్నారని.. కానీ కేసును దారి తప్పించేందుకు సిట్ ఇంకెవో విచారమలు చేస్తోంది.
పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాకపోతే… నిరుద్యోగులంతా అన్యాయమైపోయేవారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో.. నిందితులు ఎవరో గుర్తించకుండా మళ్లీ అదే బృందంతో పరీక్షలు పెట్టేస్తున్నారు. దీంతో తెలంగాణ నిరుద్యోగులు నిరాశా, నిస్పృహల్లో కి వెళ్లిపోతున్నారు. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని ఆవేదన చెందుతున్నారు. ఈకేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. సీబీఐకి ఇచ్చినా… అదో రాజకీయ ఆయుుధం అవుతుంది కానీ.. నిందితులు బయటకు వస్తారని ఎవరూ నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు.