శ్రీదేవి కుటుంబం, భర్త బోనీ కపూర్ అప్పుల ఊబిలో చిక్కుకున్నారని అతిలోక సుందరి బతికున్న రోజుల్లో మీడియా ముందు చెప్పినోళ్లు ఎంతోమంది వున్నారు. శ్రీదేవి మరణం తర్వాత మరోసారి అప్పుల ప్రస్తావన టీవీల్లో ప్రముఖంగా వచ్చింది. హైదరాబాద్లో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి నిర్వహించిన శ్రీదేవి సంస్మరణ సభలో శ్రీదేవి ఆర్థిక పరిస్థితి గురించి స్వయంగా సుబ్బరామిరెడ్డి కొన్ని విషయాలు వెల్లడించారు. శ్రీదేవికి అప్పులేం లేవన్నారు. ఆమెకు గొప్ప గొప్ప ఆస్తులు వున్నాయని చెప్పుకొచ్చారు. శ్రీదేవి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఆమె తల్లి రాజేశ్వరి చెన్నైలో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొన్నారని టీఎస్సార్ తెలిపారు. అంతేకాదు… “అప్పుడప్పుడూ ప్రాపర్టీస్ ను అలాగే వుంచాలా? లేదా వాటిని ఎవరో ఒకటికి డెవలప్మెంట్కి ఇవ్వాలా? లేదా అమ్మేసి హైదరాబాద్, బాంబేలలో ఇల్లు కొనాలా? అని నన్ను సలహా అడిగేవారు” అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ చెన్నైలోని ఇల్లు శ్రీదేవి పేరు మీదే ఉందట. శ్రీదేవి మరణించడానికి వారం రోజుల ముందు బాంబేలో ఆమెను టీఎస్సార్ కలిసినప్పుడు ఆ ఇంటికి 30 కోట్లు ఇస్తామంటున్నారని, అది అమ్మేసి బాంబేలోనే ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నట్లు శ్రీదేవి చెప్పారట. అదొక్కటే కాదు… శ్రీదేవికి చాలా ఆస్తులు వున్నాయని టీఎస్సార్ తెలిపారు.