తెలుగులో ఒక నటసామ్రాట్, మరో నట సార్వభౌముడు వుండేవారు. అక్కినేని, ఎస్వీఆర్లను ఈ బిరుదులతో పిలుస్తుంటే ఎన్టీఆర్ చాలా కాలం నటరత్న దగ్గరే ఆగిపోవడం అభిమానులకే గాక విమర్శకులకు కూడా ఆశ్చర్యంగా వుండేది. ఎన్టీఆర్‌కు కూడా నటసామ్రాట్ అనే బిరుదు విశ్వనాథ సత్యనారాయణ ఇచ్చినా అది అక్కినేనిని గుర్తు చేస్తుంది గనక ఉపయోగించేవారు కాదు. ఇక సార్వభౌమ అనిపించుకున్న ఎస్వీఆర్‌తో ఆయనకు పడేది కాదు. వారిద్దరు కొన్ని సంవత్సరాలు కలసి నటించడమే మానేస్తే 1971లో శ్రీకృష్ణవిజయం కోసం ఎంఎస్‌రెడ్డి ఎలాగో ఒప్పించి తీశారు. ఏమైతేనేం ఈ బిరుదల కొరతకు విరుగుడుగా 1974 నుంచి ఎన్టీఆర్‌ను విశ్వ విఖ్యాత నటసార్వభౌమ అనడం మొదలుపెట్టారు.దీనిపై వేటూరి సుందరరామ్మూర్తి ఈ బిరుదు ఇచ్చిన వారిలో దృష్టిలో విశ్వం అంటే ఆంధ్రదేశమేనేమో అని చమత్కరించారు. వేటూరితో పడని దాసరి 1983లో ఎన్టీఆర్ సంచలనాత్మకంగా తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు విశ్వ విఖ్యాత బిరుదును ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. సరే ఈ కథ అలా వుంచితే ఎస్వీఆర్ తర్వాత సత్యనారాయణకు నవరస నటనాసార్వభౌమ అనే బిరుదు జోడించారు. ఇప్పుడు కళాపోషకుడు టి.సుబ్బరామిరెడ్డి నటుడు నిర్మాత మోహన్‌బాబుకు విశ్వ నటసార్వభౌమ బిరుదు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొదట తాను వద్దని చెప్పినా ఆయన అభిప్రాయాన్ని కాదనలేక ఒప్పుకున్నట్టు మోహన్‌బాబు వివరించారు. తెలుగు సినిమా వజ్రోత్సవంలో ఎవరు లెజండ్ ఎవరు సెలబ్రిటీ అన్న దానిపై మెగా ఫ్యామిలీకి మోహన్ బాబుకూ మధ్య నడిచిన వివాదం అందరికీ తెలుసు.మరి ఇప్పుడు ఎలాటి వ్యాఖ్యలు వస్తాయో చూడాలి.