తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై టిఆర్ఎస్ సర్కారుకు అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపి మద్దతు లభించింది. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అవినీతి జరిగిందని ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి ఆరోపణల యుద్ధం ప్రారంభించాక కాంగ్రెస్ నేతలందరూ ఆ వాదనే తీసుకున్నారు. ఈ సమయంలో ఎంపి బాల్క సుమన్ విద్యుత్‌పై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులను సవాలు చేశారు. అందుకు సిద్ధమని కొందరు ప్రకటించిన తర్వాత మీ స్థాయికి మా నేతలు అవసరం లేదంటూ కొత్త వాదన తీసుకొచ్చారు.మరో వైపున బాల్క సుమన్ అనవసరంగా చర్చకు పిలిచి కాంగ్రెస్‌కు అస్త్రం ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహించారట. ఈ లోగా ఇద్దరి మధ్యన వాగ్యుద్ధాలు జరుగుతుండగానే మంత్రి కెటిఆర్ రంగంలోకి దిగి రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతటితో ఆగక కాంగ్రెస్ నాయకుడు టి.సుబ్బరామిరెడ్డి దగ్గరే తాము కొంటున్నాము గనక ఏవైనా ముడుపులు ఇచ్చారేమో అడిగితెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు ఘరానా సాక్షిగా సుబ్బరామిరెడ్డి ముందుకొచ్చారు. కాకతీయ కళాపరిషత్ పేరిట జరిపే బిరుదు ప్రదానాలు వగైరాల గురించి చెప్పడం కోసం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంలోనే తాము ఎలాటి ముడుపులు ఇవ్వలేదనీ, తక్కువ కొటేషన్ ఇవ్వడం వల్లనే తమకు విద్యుత్ సరఫరా కాంట్రాక్టు లభించిందనీ చెప్పారు.అయితే సరఫరా చేసే దర్మల్ పవర్ టెక్ సంస్థలో తనకు పదిహేను శాతం వాటా మాత్రమే వుందంటూ కొంతజాగ్రత్త పడ్డారు.ఏమైతేనేం ఇది రేవంత్‌కు వ్యతిరేకంగా కెటిఆర్‌ను బలపర్చడమేనని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. తొలితరం రాజకీయ వ్యాపారవేత్త అయిన టిఎస్సాఆర్కు ఇవన్నీతెలియనివా మరి!