టి.సుబ్బిరామిరెడ్డి అందరివాడు.. అందరికీ బాగా కావల్సినవాడు. ఆయన అవార్డులిస్తే.. ఓ వర్గానికే ఇస్తారా? అందులోనూ సమన్యాయం పాటిస్తారు. అందర్నీ సంతృప్తి పరుస్తారు. సరిగ్గా అదే జరిగింది. టిఎస్సార్-టీవి 9 నేషనల్ అవార్డ్స్ పేరుతో సుబ్బిరామిరెడ్డి ప్రతీ యేటా అవార్డులను ఘనంగా ఇస్తున్నారు. 2015, 2016 సంవత్సరాలకు గాను అవార్డుల లిస్టు బయటకు తీశారు. అవార్డు గ్రహీతల్ని చూస్తే టాలీవుడ్లో ఉన్న అన్ని కుటుంబాలకు, అన్ని వర్గాలకూ న్యాయం జరిగినట్టే కనిపిస్తోంది. తనవాళ్లు అనుకొన్నవాళ్లనెవ్వరినీ ఆయన వదల్లేదు. ఏదో ఓ పేరు చెప్పి అవార్డు ఇచ్చేశారు. టాలీవుడ్ సీరియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునకు ఉత్తమ నటులుగా అవార్డులు ఇచ్చేశారు. మెగా కుటుంబం నుంచి ఆ అవకాశం రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి దక్కింది. ఇక బాహుబలి వీరులు ప్రభాస్, రానాలకూ చెరో అవార్డు కట్టబెట్టారు.
ఇక అవార్డు వేడుక అంటే గ్లామర్ ఉండాలి కదా. అందుకే రకుల్, ప్రగ్యా, కేథరిన్, నివేథాథామస్లకు అవార్డులు ఇచ్చేశారు. సుబ్బిరామిరెడ్డికి బాగా కావల్సిన మోహన్‌బాబుకి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించారు. ఆత్మీయుడైన బ్రహ్మానందాన్ని ఓ అవార్డు వరించింది. లిస్టు చూస్తే… కళకళలాడిపోతుంది. అందర్నీ సంతృప్తి పరచాలన్న ఉద్దేశమో, ఏమో.. ఏవేవో కొత్త పేర్లు పెట్టి అవార్టులు ఇచ్చారు.
మొత్తానికి సుబ్బిరామిరెడ్డి మరోసారి అందరి దగ్గర నుంచీ మార్కులు కొట్టేశారు. ఇంతమంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటే.. అవార్డు ఫంక్షన్ అదరకుండా ఎలా ఉంటుంది?? సూపర్ హిట్ అవ్వడం ఖాయం. సుబ్బరామిరెడ్డి కోరుకొన్న పబ్లిసిటీ తన్నుకొంటూ వచ్చేయడం ఇంకా ఖాయం.