తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రణాళిక ప్రకారం రెచ్చగొట్టి సమ్మెకు వెళ్లేలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలు చూస్తే ఇదే నిజమని.. కార్మిక సంఘాల నేతలు.. ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. కార్మికులు మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు . ఇందులో ఒక్క ఆర్టీసీ విలీనం మినహా… మరేదీ పెద్ద డిమాండ్ కాదు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చడం, రిటైరైన తర్వాత వైట్ రేషన్ కార్డు, భరోసా పెన్షన్లు లాంటి చాలా చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి. అలాగే సంస్థ మనుగడ కోసం పార్శిల్ సర్వీసులు ప్రారంభించడం లాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఇలా కార్మికులు డిమాండ్లు అడగడమే తప్పన్నట్టుగా సర్రున లేచింది. వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వారిని రెచ్చగొట్టేలా.. ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించింది. కార్మికులు వెనక్కి తగ్గే అవకాశం లేకుండా చేసి… తాను చేయాలనుకుంటున్న పనులను ప్రభుత్వం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసలు ఆర్టీసీకి నష్టాలు ప్రభుత్వం వల్లే వస్తున్నాయంటున్నారు కార్మికులు. ఏటా ఆర్టీసీకి ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయితే ఆర్టీసీ ప్రభుత్వానికి ఏటా రూ.రెండు వందల కోట్ల ఎంవీ ట్యాక్స్, డీజీల్ పై పై పన్ను ఆరు వందల కోట్లు కడుతోంది. ఎంవీటాక్స్, డీజిల్‌ను టాక్స్ లేకుండా సరఫరా చేస్తే నష్టలు లేనట్లే. అంతే కాదు ప్రభుత్వం వివిధ వర్గాలకు ఆర్టీసీ తరపున రాయితీలిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు, జర్నలిస్టులు అనే వివిధ వర్గాలకు రాయితీలిస్తోంది. ఈ రాయితీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి 2000 కోట్లు వరకూ చెల్లించాల్సి ఉందని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. ఇవి చెల్లిస్తే.. ఆర్టీసీ నష్టాలు కూడా మాఫీ అయిపోతాయంటున్నారు. ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పన్నుల వల్లే .. ఆర్టీసీకి నష్టం వస్తోంది కానీ… కార్మికుల వల్ల కాదని ఉద్యోగులు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం.. ఈ కారణాలను గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే.. ఉద్యోగులు సమ్మె చేసి… బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలతోనే కార్మికులను రెచ్చగొట్టారని..వారు సమ్మెకు వెళ్లేలా చేశారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ద్రోహి పువ్వాడ అజయ్‌తో మాట్లాడించి సమ్మెకు పురిగొల్పారని.. కుక్కలతో పోల్చి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదుని .. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ గోల్డ్‌స్టోన్ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేశారన్నారు. ఆర్టీసీ భూముల్ని ఇప్పటికే లీజుల పేరుతో కేసీఆర్ బంధువులు తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు … ప్రభుత్వంలో విలీనం అన్న ఒక్కటి తప్ప.. అన్నీ పరిష్కరించదగ్గవే.. అయినా.. తెగేదాకా ప్రభుత్వం ఎందుకు లాగుతోందనేది.. రాజకీయవర్గాల్లో సైతం చర్చనీయాంశమవుతోంది.